Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అన్నదాత కడుపు కొడుతున్న దళారీ దందా..

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 08:19 PM | తాజావార్తలు Flash News
అన్నదాత కడుపు కొడుతున్న దళారీ దందా..

మాచారం గౌరీ శంకర్ రైస్ మిల్లు ఎదుట బాధిత రైతు కన్నెర్ర
మాట మార్చి తక్కువ ధర చెల్లింపు.. కటింగ్‌ల పేరుతో అదనపు దోపిడీ ఆరోపణలు
యంత్రాంగం తక్షణమే స్పందించి మిల్లుపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
పెన్‌పహాడ్, నవంబర్ 15:-</b> ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వెళ్లిన రైతుకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు పెన్‌పహాడ్ మండలంలో కలకలం రేపుతున్నాయి. మాచారం గ్రామ శివారులోని గౌరీ శంకర్ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, గుడిబండ తండాకు చెందిన భూక్య వీరేందర్ నాయక్ అనే రైతు శనివారం మిల్లు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధిత రైతు విలేకరులతో మాట్లాడుతూ మిల్లు యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 3వ తేదీన తాను సదరు మిల్లులో ధాన్యం విక్రయించగా, క్వింటాకు రూ. 3,700 ఇస్తామని తొలుత ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. అయితే రసీదు మాత్రం రూ. 3,650 కే ఇచ్చారని, దీనిపై ప్రశ్నించగా నగదు చెల్లించే రోజున మాట్లాడుకున్న ప్రకారమే రూ. 3,700 చొప్పున కలిపి ఇస్తామని యాజమాన్యం నమ్మబలికిందని పేర్కొన్నారు. తీరా డబ్బుల కోసం శనివారం మిల్లుకు వెళ్లగా, రసీదులో ఉన్న ప్రకారం రూ. 3,650 మాత్రమే చెల్లిస్తామని, ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ సిబ్బంది తనపట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అయ్యప్ప మాల ధరించానన్న గౌరవం కూడా లేకుండా తనను అవమానపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించారు. ఇతర మిల్లులన్నింటిలో సీసీ (కటింగ్) కింద రూపాయి మాత్రమే తీసుకుంటుండగా, ఈ మిల్లులో మాత్రం రూపాయిన్నర చొప్పున అదనపు కోతలు విధిస్తున్నారని తెలిపారు. పక్కనే ఉన్న మిల్లులలో క్వింటాకు రూ. 3,900 వరకు ధర చెల్లిస్తుంటే, ఇక్కడ మాత్రం తేమ శాతం సాకుతో రైతుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా సివిల్ సప్లై, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సదరు మిల్లు రికార్డులను తనిఖీ చేసి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మిల్లును సీజ్ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తోటి రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వీరేందర్ నాయక్ హెచ్చరించారు. కాగా, ఈ ఆరోపణలపై మిల్లు యాజమాన్యం వివరణ తెలియాల్సి ఉంది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.