Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తూకంలో దళారుల మాయాజాలం రైతుల నిఘాతో బయటపడ్డ మోసం

Author
Posted By A.Timma Gurudu
| 13 Nov 2026, 08:09 PM | Array
తూకంలో దళారుల మాయాజాలం రైతుల నిఘాతో బయటపడ్డ మోసం

వాహనాలను అడ్డుకుని ఆందోళన..
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూరు గ్రామంలో పత్తి కొనుగోళ్లలో దళారుల భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తూకంలో వ్యత్యాసం చూపి రైతులను నిలువునా ముంచే ప్రయత్నం చేసిన దళారులను బాధిత రైతులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశారు.

అసలేం జరిగింది?..

పూడూరు గ్రామానికి చెందిన సుమారు 25 నుండి 30 మంది రైతులు తమ పంటను స్థానిక దళారులకు విక్రయించారు. అయితే, బయట వేబ్రిడ్జిపై తూకం వేసిన బరువుకు, దళారుల కాంటాకు మధ్య భారీ తేడా రావడంతో రైతులు అవాక్కయ్యారు. ఒక రైతు పత్తి బయట 66 క్వింటాళ్లు తూకం రాగా, దళారీ వద్దకు వచ్చేసరికి కేవలం 38 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు చూపించారు. మరో రైతుకు సంబంధించి బయట 105 క్వింటాళ్లు తూకం రాగా, దళారీ కాంటాలో 86 క్వింటాళ్లు మాత్రమే నమోదైంది. ఇక్కడ ఒక్క రైతు వద్దే ఏకంగా 19 క్వింటాళ్ల పత్తి తక్కువగా చూపి, ప్రస్తుత మార్కెట్ ధర (క్వింటాకు రూ. 9,500) ప్రకారం దాదాపు రూ. 1.80 లక్షలు కాజేసే ప్రయత్నం చేశారు.
డబ్బులివ్వకుండా పరారైన దళారులు
తూకంలో మోసాన్ని రైతులు ముందే పసిగట్టడంతో దళారులు అప్రమత్తమయ్యారు. కొనుగోలు చేసిన పత్తికి అడ్వాన్స్ రూపంలో కొంత నగదు ఇస్తామని రైతులను నమ్మించి, అక్కడి నుండి జారుకున్నారు. మరోవైపు రైతులకు పూర్తి డబ్బులు చెల్లించకుండానే పత్తిని రెండు బొలెరో వాహనాల్లో లోడ్ చేసి తరలించే ప్రయత్నం చేయగా, ఆగ్రహించిన రైతులు ఆ వాహనాలను గ్రామంలోనే అడ్డుకున్నారు.
నేతల తీరుపై రైతుల ఆగ్రహం
ఈ వివాదంలో స్థానిక రాజకీయ నేతల వ్యవహారశైలిపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు రైతులకు న్యాయం చేస్తామని నమ్మబలికిన కొందరు నేతలు, ఆ తర్వాత మాట మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టుబడిన రెండు బొలెరో వాహనాలను గ్రామ పంచాయతీ/సర్పంచ్ కార్యాలయం వద్ద భద్రపరచాలని రైతులు కోరగా, అలంపూర్ ప్రాంతానికి చెందిన ఒక నేతకు చెందిన అనుచరులు వాహనాలు కావడంతో వాటిని అక్కడ ఉంచడానికి ఓ స్థానిక నేత నిరాకరించడం వివాదాస్పదమైంది.
న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులే దళారులకు వత్తాసు పలుకుతూ, వారిని కాపాడేందుకు పావులు కదుపుతున్నారని గ్రామంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కలెక్టర్ స్పందించాలని వేడుకోలు..
జులకల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు రైతులు పేర్కొంటున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై ప్రత్యేక చొరవ తీసుకుని, తూకంలో మోసాలకు పాల్పడుతున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పూడూరు రైతులు డిమాండ్ చేస్తున్నారు...

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.