Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కవిత ఫైర్.. రేవంత్ సర్కారుకు నెల రోజుల డెడ్‌లైన్!

Author
Posted By Telangana Vaartha
| 06 Nov 2026, 01:07 AM | పాలిటిక్స్ Politics
అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కవిత ఫైర్.. రేవంత్ సర్కారుకు నెల రోజుల డెడ్‌లైన్!

హైదరాబాద్:- నగరంలోని ఖానామెట్ పరిధిలో ఉన్న అయ్యప్ప సొసైటీలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈలోగా చర్యలు తీసుకోకపోతే తామే క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్రమ నిర్మాణాలకు రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరించారు.
గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. అయ్యప్ప సొసైటీలో గురుకుల ట్రస్ట్‌కు సంబంధించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 500 నుంచి 700 వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయని ఆరోపించారు. ప్రస్తుతం కూడా దాదాపు 80 భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు.
ఆ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకపోయినా నోటరీల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని కవిత ఆరోపించారు. పది అంతస్తుల వరకు భవనాలు నిర్మిస్తూ వాటిలో పీజీ హాస్టళ్లు, కళాశాలలు నిర్వహిస్తున్నారని చెప్పారు. భవనాల మధ్య కనీసం అగరుబత్తి పట్టేంత స్థలం కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అగ్నిప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఇక్కడ భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.
ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి సోదరుల అండతోనే కొంతమంది బిల్డర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలపై వార్తలు సేకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా బెదిరిస్తున్నారని, తమ వెనుక పెద్దలు ఉన్నారని కొందరు చెబుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మీడియాకు కూడా రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆదిత్య బిల్డర్స్‌పై కూడా కవిత విమర్శలు చేశారు. గతంలో తాము ఆ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పటికీ, కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి విల్లాలు ఇచ్చారనే కారణంతోనే అనుమతులు లభిస్తున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు కూడా సరిగా జరగడం లేదని కవిత అన్నారు. దాదాపు 18 వేల ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అయ్యప్ప సొసైటీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం తాను స్వయంగా ఆర్టీఐ దరఖాస్తు చేస్తానని, అధికారులు వెంటనే సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. 320 మండలాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదని విమర్శించారు. రైతులు పంటలు వేయాలా వద్దా అనే విషయంలో ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి మధ్య స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే అవకాశాలను ప్రభుత్వం వదులుకుందని ఆరోపించారు.
చివరగా రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కవిత పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతో తమ పార్టీ ముందుకు సాగుతోందని, మహిళా గ్రాడ్యుయేట్లు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. మొత్తంగా అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కవిత విధించిన గడువు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.