Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సైబర్ నేరాలపై అప్రమత్తతే అసలైన రక్షణ... జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

Author
Posted By Telangana Vaartha
| 04 Nov 2026, 06:05 PM | తాజావార్తలు Flash News
సైబర్ నేరాలపై అప్రమత్తతే అసలైన రక్షణ... జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

⟹సైబర్ మోసాలకు గురైతే వెంటనే స్పందించండి... ఆలస్యం చేయవద్దు... అప్రమత్తంగా ఉండండి...

⟹ ప్రతి నెల మొదటి బుధవారం “సైబర్ జాగ్రత్త దివాస్”
జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ సూచించారు.

సైబర్ నేరాల నివారణలో భాగంగా ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహిస్తున్న “సైబర్ జాగ్రత్త దివాస్” కార్యక్రమంలో భాగంగా బుదవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా ఎస్పీ అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ తో కలిసి విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలను వినియోగించే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. తెలియని లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు.

సైబర్ మోసాల నుంచి రక్షణకు ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు:
వినికిడి, చూపు, స్పర్శ, వాసన, అభిరుచి వంటి పంచేంద్రియాల సమాచారాన్ని అనవసర యాప్‌లు లేదా వెబ్‌సైట్లకు ఇవ్వకూడదు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్, ఆన్‌లైన్ చాటింగ్‌లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. అనుమానాస్పద లింకులు, ఫేక్ మెసేజ్‌లు, తెలియని యాప్‌లను ఓపెన్ చేయకూడదు. తెలియని వ్యక్తులు పంపిన లింకుల ద్వారా యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు. సైబర్ నేరగాళ్లు అడిగినప్పటికీ OTP, PIN, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. పబ్లిక్ Wi-Fi, అనుమానాస్పద నెట్‌వర్క్‌లలో బ్యాంకింగ్ లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. మొబైల్ ఫోన్, యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలి. అవసరం లేని యాప్‌లకు కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్స్ వంటి అనుమతులు ఇవ్వకూడదు.

ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు:
భారీ డిస్కౌంట్లు, తక్కువ ధరల పేరుతో వచ్చే సందేశాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే అవకాశం ఉన్నందున, వెబ్‌సైట్ యొక్క సరైన అడ్రస్‌ను పరిశీలించిన తర్వాతే కొనుగోళ్లు చేయాలని తెలిపారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, వీలైనంత వరకు నమ్మకమైన వెబ్‌సైట్లు, అధికారిక యాప్‌ల ద్వారా మాత్రమే షాపింగ్ చేయాలని సూచించారు. డిజిటల్ చెల్లింపుల్లో అప్రమత్తత అవసరం ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు అధికారి, యూపీఐ ప్రతినిధి లేదా ఇతర సంస్థల ప్రతినిధినని చెప్పినా వెంటనే నమ్మవద్దని తెలిపారు. SMS, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని సూచించారు. UPI ద్వారా డబ్బు పొందడానికి QR కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదని, డబ్బు పంపే సమయంలో మాత్రమే జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఫోన్ కాల్‌లో ఎవరైనా బ్యాంకు వివరాలు, OTP, PIN లేదా పాస్‌వర్డ్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని హెచ్చరించారు.

“అప్రమత్తతే సైబర్ భద్రతకు మొదటి అడుగు”
సైబర్ నేరాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా, సైబర్ నేరాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. .

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.