Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విద్యార్థులు చదువులో రాణించాలి

Author
Posted By A.Timma Gurudu
| 03 Nov 2026, 05:56 PM | Array
విద్యార్థులు చదువులో రాణించాలి

మెనూ ప్రకారం వంట చేయని ఏజెన్సీని తొలగించాలని ఆదేశాలు.
వైద్య ఉపకేంద్రం సిబ్బందికి షోకాజు నోటీసుల జారీ.
ఇంటర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-
ప్రభుత్వ పాఠశాలలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. ముందుగా గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించి విద్యార్థులు పాఠశాలకు ఎక్కువగా సెలవులు పెట్టకుండా సూచించాలని, ఇంటి వద్ద కూడా చదువుకునేలా ప్రోత్సహించాలని తెలియజేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కులపై ఆరా తీశారు. విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి సారించాలని, ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థులు అందరూ 550కు పైగా మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటి నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించేందుకు మెస్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఫీడ్బ్యాక్ రికార్డులో చాలామంది విద్యార్థులు భోజనం యావరేజ్ గా ఉందని రాయడంతో సంబంధిత సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వండనందుకు ప్రస్తుత ఏజెన్సీని తొలగించి, కొత్త వారిని నియమించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ ను ఆదేశించారు.
గ్రామంను పరిశుభ్రంగా ఉంచాలి.
జల్లాపురం గ్రామంలో పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోవడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, రోగాలు వ్యాపించకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైద్య ఉపకేంద్రం వద్దకు వెళ్ళగా తాళం వేసి ఉండడంతో ఉపకేంద్రంలోని సిబ్బంది అందరికీ షోకాజు నోటీసులు జారీ చేయాలని
డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయితో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ ఆదేశించారు.
ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి.
అనంతరం జిల్లా కలెక్టర్ మానవపాడు మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఇంజనీరింగ్, వైద్య విద్య లాంటి ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రణాళికతో చదవాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా ఎప్పటికప్పుడు అధ్యాపకులను అడిగి పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ప్రతి మనిషి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక దశ అని, భావి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ దశలో విద్యార్థులు చదువు పైనే ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై తరచూ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని అధ్యాపకులను ఆదేశించారు. చరవాణిలను అనవసరంగా వినియోగిస్తూ కాలాన్ని వృధా చేయకుండా, ఆన్లైన్ డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ఆన్లైన్ తరగతులను కూడా వినాలని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి కంటే ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని, ఇంటర్ ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉండేందుకు కృషి చేయాలన్నారు. ఆంగ్లంలో మంచి పట్టు సాధించాలని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమని, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లోనూ సత్తా చాటాలని, క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు సకాలంలో అందజేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సుమారు మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున విద్యార్థులందరూ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్యటనలో సర్పంచ్ నందిని, ఇంటర్ నోడల్ అధికారి హృదయ రాజ్, తహసిల్దార్ మన్సూర్ అలీ సిద్ధికి, ఎంపీడీవో రాఘవ, కళాశాల ప్రిన్సిపల్ మంజుల, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.