Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జోగులాంబ సన్నిధిలో... దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:38 PM | తాజా వార్తలు
జోగులాంబ సన్నిధిలో... దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల, (అక్టోబర్ 06) :
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను జోగులాంబ సన్నిధిలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి,భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా నిర్వహించాలన్నారు.భక్తులకు దర్శనం,ప్రసాదం, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా స్పష్టమైన దిశా సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు.దైవదర్శనానికి వచ్చే విఐపిల ప్రోటోకాల్ విషయంలో సమస్యలు రాకుండా పూర్తి జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసి,అక్కడి నుంచి దేవస్థానం వరకు షటిల్ వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు.అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక సిబ్బందిని నియమించి,ఫోన్ నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.అదనపు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి,భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేడుకలకు వచ్చే భక్తులకు త్రాగు నీటిని మిషన్ భగీరథ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టి దేవాలయ ప్రాంగణాన్ని, ఘాట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాలలో వైద్య సేవలు అందించే విధంగా మెడికల్ క్యాంపు,ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని,విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.అలంపూర్ వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు,అలంపూర్ నుంచి దేవస్థానం వరకు ప్రత్యేక షటిల్ సర్వీసులు పెంచాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు.ఘాట్ వద్ద భక్తుల భద్రత కోసం ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచాలని మత్స్యశాఖ అధికారిణిని ఆదేశించారు.భక్తుల సౌకర్యార్థం ఫుడ్ స్టాళ్లను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. తెప్పోత్సవ పడవలను ఇరిగేషన్ అధికారులు తనిఖీ చేసి,ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్న పడవలనే వినియోగించేలా చూడాలని సూచించారు.దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ ఇంజిన్‌ను సిద్ధంగా అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక అధికారిని ఆదేశించారు.అలంపూర్ ఆలయాల చరిత్ర,జోగులాంబ అమ్మవారి విశిష్టతను తెలియజేసే సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షోతో పాటు దసరా ఉత్సవాలపై సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్,అదనపు ఎస్పీ శంకర్,ఆలయ ఈఓ దీప్తి,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.