జిల్లాలో ఇసుక నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలి
అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు
తుమ్మిళ్ల ఇసుక రీచ్ నిర్వహణ పక్కాగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల.
జిల్లాలో ఇసుక నిర్వహణను పారదర్శకంగా చేపట్టడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో ఇసుక నిర్వహణను పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ,ప్రజలకు అవసరమైన ఇసుకను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.తుంగభద్ర,కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రస్తుతం నదుల్లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున నదీ గర్భంలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల పర్యావరణానికి, భూగర్భ జలాలకు నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.నదుల పరివాహక గ్రామాల్లో సంబంధిత సర్పంచులు,గ్రామ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు,ఇతర శాఖల అధికారులతో గ్రామ సభలు నిర్వహించి అక్రమ ఇసుక తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు లేదా రవాణా జరిగినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు,రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జూరాల రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మోటార్ పంపులు ఏర్పాటు చేయడం,నీటిని తోడటం వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ ప్రాంతాల్లో అనధికార మోటార్ పంపుల కనెక్షన్లను గుర్తించి,సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.ఇందుకోసం పోలీస్,ఇరిగేషన్,రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా ఇసుక జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఇసుక రవాణాకు ఉపయోగించే ప్రధాన మార్గాలను గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.అక్రమ రవాణాకు ఉపయోగించే ప్రధాన మార్గాల్లో అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని తుమ్మిళ్ల ప్రభుత్వ ఇసుక రీచ్ నిర్వహణను పక్కాగా చేపట్టాలన్నారు.ప్రభుత్వ నిబంధనలు,అనుమతుల మేరకే ఇసుక తవ్వకాలు జరగాలని,ఇసుక నిల్వలు,తవ్వకాలు,విక్రయాలు,రవాణా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.రీచ్ నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ అక్రమాలకు తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.అదేవిధంగా జిల్లాలో గృహ నిర్మాణాలు చేపడుతున్న ప్రజలు,ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను నిబంధనల ప్రకారం త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఇసుక సరఫరాలో అనవసర జాప్యం జరగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని,ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.అక్రమ ఇసుక తవ్వకాలు,రవాణా, అధిక ధరలకు విక్రయాలు, అనధికార నిల్వలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రజలకు అవసరమైన ఇసుకను పారదర్శకంగా అందించడంతో పాటు నదులు,సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఇసుక నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమ కార్యకలాపాలకు సహకరించినా సంబంధిత వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఏ.డి.మైన్స్ ఆనంద్ కుమార్ స్టీఫెన్,ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాసులు,తహసీల్దార్ ప్రభాకర్,కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.