🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 November 2026, 6:46 pm Posted by : Telangana Vaartha

ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

News Image
పట్టభద్రుల ఓటరు జాబితా తయారీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అధికారులు.
జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితా డి-నోవో (కొత్తగా) రూపకల్పన ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా అధికారులకు సూచించారు. పట్టభద్రుల ఓటరు జాబితా డి-నోవో రూపకల్పనలో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులు, ఓటరు జాబితా పరిశీలకులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు, దరఖాస్తుల పరిశీలన, ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిని వివరించారు. ఇప్పటివరకు జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 22,987 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించి అందిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించినట్లు వెల్లడించారు. ఇంకా 40 దరఖాస్తులు పరిశీలనకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 14,172 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.
ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం నిర్ణీత విధి విధానాల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబర్ 30వ తేదీన తుది పట్టభద్రుల ఓటరు జాబితాను ప్రకటించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు అనర్హుల పేర్లు ఓటరు జాబితాలో చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు బహిరంగ ప్రకటనలు, వార్తాపత్రికల ద్వారా ప్రచారం నిర్వహించామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అల్యూమిన్, తదితర అసోసియేషన్ల సహకారంతో ముందుకెళ్లడం జరిగిందన్నారు. సామూహికంగా సమర్పించే దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి, ప్రతి దరఖాస్తు అర్హతను స్వతంత్రంగా ధ్రువీకరించిన తర్వాతే ఆమోదిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు.
అంతకుముందు ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి చేపట్టిన డీ-నోవో ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని, అర్హత లేని వ్యక్తులకు ఓటరు జాబితాలో చోటు కల్పించరాదని ఆదేశించారు.
ప్రస్తుత ఓటరు జాబితా తయారీ పూర్తిగా కొత్తగా చేపడుతున్న డీ-నోవో ప్రక్రియ అని, గతంలో ఉన్న ఓటరు జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన ప్రస్తుతం కూడా అవి ఆటోమేటిక్‌గా కొనసాగవని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రాజకీయ పార్టీలు, ప్రజలు, ఇతర భాగస్వాములకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి విద్యార్హతలను సంబంధిత ధ్రువీకరణ పత్రాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. తగిన విద్యార్హతలు లేని వ్యక్తులను ఓటరు జాబితాలో చేర్చరాదని, అనర్హుల నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఒకే వ్యక్తి పేరు వేర్వేరు ప్రాంతాల్లో నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దరఖాస్తుల్లో పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సరైన ఆధారాలతో నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో సంఖ్య పెంచడం కంటే అర్హులైన ఓటర్లను మాత్రమే చేర్చి నాణ్యమైన జాబితా రూపొందించడం ముఖ్యమని పేర్కొన్నారు.
ఓటరు నమోదు ప్రక్రియకు వినియోగించే సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ వ్యవస్థలను ముందుగానే పూర్తిస్థాయిలో పరీక్షించాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు, అనువాద లోపాలు, అప్లికేషన్ సెంటర్లలో ఎదురయ్యే ఇబ్బందులను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. సరైన పరీక్షలు, ధ్రువీకరణ లేకుండా కొత్త సాఫ్ట్‌వేర్ లేదా ఫీచర్లను అమలు చేయరాదని స్పష్టం చేశారు. ఓటరు జాబితా తయారీ ప్రతి దశలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, వారి అభ్యంతరాలు, సూచనలను నమోదు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశాల వివరాలు, తీసుకున్న నిర్ణయాలను రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు.
రోల్ అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణ, పత్రాల ధ్రువీకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. గత సమావేశంలో సూచించిన ప్రత్యేక డ్రైవ్ నిర్వహణపై కూడా వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ కాన్ఫరెన్స్ లో ఆర్డిఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో మంజుల, వివిధ మండలాల తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home