🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 November 2026, 1:17 pm Posted by : Telangana Vaartha

సైబర్ మోసాల బాధితులకు సత్వర సేవలు.

News Image
- సైబర్ మోసాలకు గురైన బాధితులు కోల్పోయిన నగదును తిరిగి రాబట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.
- సైబర్ వారియర్స్, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
- సైబర్ నేరాల పట్ల ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలి.
- సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలు : జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.
సైబర్ మోసాలకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించడంతో పాటు, ప్రజలు, వినియోగదారులు సైబర్ నేరగాళ్ల బారినపడి ఆర్థికంగా నష్టపోకుండా సైబర్ వారియర్స్, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచించారు.

జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని సైబర్ వారియర్స్, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ కేంద్ర బిందువుగా పనిచేస్తూ సైబర్ మోసాల నివారణ మరియు సైబర్ మోసాలలో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు సత్వరం సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల నివారణ, మోసాలకు గురైన బాధితులు కోల్పోయిన నగదును తిరిగి రాబట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు సత్వర న్యాయం అందించే విధానం, సిబ్బంది అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు.
సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించాలని, మోసపోయిన నగదును నిలిపివేయడం, తిరిగి బాధితులకు అందేలా సంబంధిత బ్యాంకులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సైబర్ వారియర్స్ ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేస్తూ, స్థానిక పోలీస్ అధికారుల సహకారంతో సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ భద్రతపై సూచనలు చేశారు.

1. మొబైల్ ఫోన్లకు మెసేజ్‌ల రూపంలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.
2. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు వెల్లడించవద్దు.
3. తెలియని వ్యక్తులు డబ్బులు పంపాలని కోరితే నిర్ధారించుకోకుండా నగదు బదిలీ చేయవద్దు.
4. ఆన్‌లైన్ పెట్టుబడులతో తక్కువ సమయంలో రెండింతల లాభాలు వస్తాయని చెప్పే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దు.
5. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే భయపడవద్దు. ఎవరికీ డబ్బులు చెల్లించవద్దు.
6. బహుమతులు వచ్చాయని, వాటిని పొందేందుకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరితే స్పందించవద్దు.
7. అనధికారిక లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దు.

సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, టెక్నికల్ టీమ్ ఎస్ఐ సాయిరాం, జిల్లాలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సైబర్ వారియర్స్, పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.
🏠 Home