🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 November 2026, 7:30 pm Posted by : Telangana Vaartha

నిజమైన సాధకుడు

News Image
ఒకసారి ఒక సాధువు, మరొక సాధకుడు కలిసి ఏదో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనికి ఆ సాధకుడు ముందే పరిచయం. అయితే, ఆ సాధకుడిని చూడగానే అతడు దుర్భాషలాడటం ప్రారంభించాడు.

ఇది గమనించిన సాధువు ఆశ్చర్యపోయి, ఆ వ్యక్తితో ఇలా అన్నారు. “సోదరా! మీరు ఎందుకు ఇంత అసభ్యకరమైన భాషలో తిడుతున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మీ నోరు అపవిత్రం చేసుకుంటున్నారు కదా!” అని హితవు పలికారు.

సాధువు మాటలు విన్న సాధకుడికి ధైర్యం వచ్చింది. వెంటనే అతడు కూడా ఆ వ్యక్తిని తిరిగి దుర్భాషలాడటం ప్రారంభించాడు. అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ పరిస్థితిని చూసిన సాధువు ఎంతో బాధపడ్డారు. తెలియని వ్యక్తికి హితబోధ చేయగలిగారు కానీ, సాధకుడికి ఏమని చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు.

చివరకు ఆ ఇద్దరూ గొడవను విడిచిపెట్టి తమ తమ దారిన వెళ్లిపో యారు. సాధువు తన కుటీరానికి తిరిగి వచ్చి భజనలు చేసుకుంటూ కూర్చున్నారు.

కొంతసేపటి తర్వాత ఆ సాధకుడు సాధువును వెతుక్కుంటూ కుటీరానికి చేరుకున్నాడు. అక్కడ కూర్చున్న సాధువును చూసి, “మహారాజ్! మీరు నన్ను ఆ దుష్టుడి దగ్గర ఎందుకు ఒంటరిగా వదిలేసి వచ్చారు?” అని ప్రశ్నించాడు.

అప్పుడు సాధువు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు.

"మీరు ఒంటరిగా ఉన్నంతవరకు నేను మీకు తోడుగా ఉన్నాను. కానీ మీరు ఎదుటివారి తిట్లకు తిట్లతోనే సమాధానం చెప్పడం ప్రారంభించినప్పుడు, అంతటితో ఆగకుండా ఆ వ్యక్తిని కొడతానని బెదిరించినప్పుడు, మీకు తోడుగా ఉండటానికి హింస కూడా వచ్చిందని నేను భావించాను. అలాంటప్పుడు ఇక నా అవసరం ఏముంది? అందుకే నేను తిరిగి వచ్చేశాను” అని అన్నారు.

సాధువు మాటలు విన్న సాధకుడు తన తప్పును గ్రహించాడు. ఎదుటివారు ఎన్ని దుర్భాషలు పలికినా, వాటికి తిరిగి దుర్భాషలతో సమాధానం ఇవ్వడం నిజమైన సాధకుడి ధర్మం కాదని అర్థం చేసుకున్నాడు.

నీతి: నిజమైన సాధకుడు అంటే కేవలం భజనలు చేసేవాడు, పూజలు చేసేవాడు మాత్రమే కాదు. ఎదుటివారు అవమానించినా, కోపానికి లోనుకాకుండా, తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని, సహనం మరియు సంయమనంతో ప్రవర్తించేవాడే నిజమైన సాధకుడు.

┈┉❀꧁గురుభ్యోనమః꧂❀┉┈
ఆధ్యాత్మిక అన్వేషకులు
🍁📿🍁 🙏🕉️🙏 🍁📿🍁
🏠 Home