విధుల్లో అలసత్వం చూపే ఉద్యోగులను తొలగించాలి
హాజరు నమోదు చేయని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హెచ్చరిక.
వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.
ఆసుపత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల సూర్య ప్రతినిధి. జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో నీ విధుల్లో అలసత్వం చూపే ఉద్యోగులను తొలగించాలని, హాజరు సక్రమంగా నమోదు చేయని ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.
గద్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసూతి, శిశు సంరక్షణ విభాగాలు, ఇన్‌పేషెంట్ వార్డులు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, వైద్య సిబ్బంది హాజరు, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రసూతి, డెలివరీ విభాగాల్లో అనవసరమైన రద్దీ లేకుండా చూడాలని, ప్రసవం అనంతరం తల్లులు, శిశువులను నిర్దేశించిన వార్డులకు తరలించాలని సూచించారు. నవజాత శిశువుల గుర్తింపు కోసం తల్లి, తండ్రి వివరాలు, ప్రత్యేక ఐడీతో కూడిన ట్యాగింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నియోనాటల్ స్పెషలిస్ట్ సేవల అవసరాన్ని పరిశీలించాలని సూచించారు. మాతా సంరక్షణ విభాగంలో బెడ్ షీట్ల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అభివృద్ధి పనులకు రూ.50 లక్షల నిధులు మంజూరు.
ఆసుపత్రిలో వివిధ మరమ్మత్తులు, అభివృద్ధి పనులకు రూ.50 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని వార్డుల్లో ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, తదితర సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ, వార్డుల పరిశుభ్రత, రోగులకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన చోట జెరియాట్రిక్ వార్డును అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వివిధ వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. వారి కేసు షీట్లను పరిశీలించి అందిస్తున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులను ఇతర ప్రాంతాలకు అనవసరంగా రిఫర్ చేయడం తగదన్నారు. నిబంధనల ప్రకారం ఇన్ పేషెంట్ లకు ఆహారం అందజేయాలని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోగులతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలని రోగులను సూచించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. డిస్పెన్సరీ, సెంట్రల్ స్టోర్స్‌లో మందుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు పంపించడం లేదా బయట మందులు కొనుగోలు చేయాలని సూచించడం, ప్రభుత్వ వైద్య సామాగ్రిని బయట అమ్ముకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైద్య సిబ్బంది హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ
వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావాలని, బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. పర్యవేక్షకుల ఛాంబర్ లో కలెక్టర్ ఉద్యోగుల, ఇతర సిబ్బంది హాజరు రిజిస్టర్ లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గత 45 రోజుల హాజరు వివరాలను పరిశీలించి, మాన్యువల్ రిజిస్టర్, ఆన్లైన్, బయోమెట్రిక్ హాజరు వివరాలను సరిపోల్చి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది హాజరు, పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, దీర్ఘకాలంగా విధులకు హాజరుకాని వారి స్థానంలో ఆమోదిత మెరిట్ జాబితా ప్రకారం తదుపరి అర్హులైన అభ్యర్థులను నియమించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెరిట్ జాబితాలో ఎలాంటి మార్పులు చేయడానికి ఏజెన్సీలకు అధికారం లేదని స్పష్టం చేశారు.
మూడు షిఫ్టుల్లో వైద్య సేవలు అందించాలి.
ఆసుపత్రిలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఓపి బ్లాక్ వద్దకు వెళ్ళిన కలెక్టర్ అక్కడి ఔట్ పేషెంట్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఇబ్బంది లేకుండా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. గైనకాలజీ విభాగం ఇరుకుగా ఉండడంతో మరోచోటికి తరలించాలన్నారు. కొత్తగా చేరిన నర్సింగ్, సాంకేతిక సిబ్బందికి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో థియరీతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించాలని తెలిపారు. ఎంఎల్టి, ఎంపీహెచ్‌డబ్ల్యూ పూర్తి చేసిన విద్యార్థులు ఆసుపత్రికి శిక్షణ నిమిత్తం రావడంతో కలెక్టర్ వారితో మాట్లాడారు. విద్యార్థులు పనిలో నైపుణ్యాలను మెరుగుపరచుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆసుపత్రిలో పారిశుద్ధ్యనికి ప్రాధాన్యతనివ్వాలి.
ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, భద్రతా సిబ్బంది విధులను పటిష్టంగా పర్యవేక్షించాలని, వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. రోగుల సహాయకులు పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ కూర్చోకుండా వారికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి కొరత లేకుండా చూడాలని, వాష్‌రూమ్స్ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండకుండా పలుచోట్ల భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తనిఖీలో గుర్తించిన లోపాలను తక్షణమే సరిచేయాలని, చేపట్టిన చర్యలపై విభాగాల వారీగా సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్టును సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్యం, నాణ్యమైన సౌకర్యాలు అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు ఝాన్సీ లక్ష్మి, ఇతర వైద్యాధికారులు, తదితరులున్నారు.