ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులు స్వీకరణ : జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్
ప్రజల నుండి స్వీకరించిన పిర్యాదుల పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ అన్నారు.
ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 11 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వారి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. తద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం పెరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఈ రోజు వచ్చిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించినవి – 04, భర్త హరాస్మెంట్ కు సంబంధించి – 01, గొడవలకు సంబంధించి-02, అప్పుగా డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని -01, కొడుకులు అన్నం పెట్టడం లేదని -01, ఇతర అంశాలకు సంబంధించినవి – 02 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డి. ఎస్పీ మొగిలయ్య, అలంపూర్, గద్వాల్ సర్కిల్ అధికారులు పాల్గొన్నారు.