రానున్న వేసవిలో తాగునీటి కష్టాలు రాకుండా గద్వాల జిల్లాలో ప్రత్యేక డ్రైవ్
* ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని,.
లీకేజీలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపు.
జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.ఐజ.ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లాలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక తాగునీటి సరఫరా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం అయిజ మండలంలోని బోయనిపల్లి గ్రామ పంచాయతీలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి, మిషన్ భగీరథ గ్రిడ్ మరియు ఇంట్రా సిబ్బందితో కలిసి పర్యటించారు. గ్రామంలోని బోర్‌వెల్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, చేతిపంపులు, పైప్‌లైన్లు మరియు తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నీటి సరఫరాలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, ప్రజలకు సక్రమంగా తాగునీరు అందుతున్నదా అనే అంశాలను పరిశీలించారు. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు.
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరమైనంత నీటిని మాత్రమే ఉపయోగించుకోవాలని, కుళాయిలను తెరిచి ఉంచడం, నీటిని అనవసరంగా పారబోయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు. అదేవిధంగా నీటి పైప్‌లైన్లలో లీకేజీలు, కుళాయిల వద్ద నీటి వృథా, చేతిపంపులు లేదా ఇతర సరఫరా పరికరాల్లో సమస్యలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించగలమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిరంతరం కొనసాగిస్తూ, ప్రతి గ్రామంలోని తాగునీటి సరఫరా పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. రానున్న వేసవిలో జిల్లాలోని ప్రతి గ్రామీణ ఆవాసానికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.