🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 November 2026, 7:36 pm Posted by : Telangana Vaartha

కుట్కనూరు ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలి.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం

News Image
సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రభుత్వ టీచర్ లేదా విద్యా వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ.
జోగులాంబ గద్వాల నవంబర్ 16 తెలంగాణ వార్తా ప్రతినిధి. అయిజ. మండలం కుట్కనూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నెలకొన్న తీవ్ర ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని కోరుతూ కుట్కనూరు మాజీ సర్పంచ్ బెంజిమెన్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో రెండు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (పాత మరియు కొత్త పాఠశాలలు) ఉన్నాయని, పాత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, కొత్త పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కేటాయించబడి ఉన్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అయితే, కొత్త పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వ్యక్తిగత మరియు అనారోగ్య కారణాల వల్ల ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం సెలవు (లాస్ ఆఫ్ పే) పెట్టడం జరిగిందని తెలిపారు. దీంతో ఆ పాఠశాల బాధ్యతలను పాత పాఠశాల ఉపాధ్యాయుడికి అప్పగించడంతో.. ఒకే ఉపాధ్యాయుడు రెండు పాఠశాలల అదనపు బాధ్యతలు మరియు తరగతి గది బోధనను నిర్వహించడం కష్టతరంగా మారిందని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి కుట్కనూరు (కొత్త) ప్రాథమిక పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈ వినతిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని లేదా విద్యా వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీలర్ బందె నవాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home