ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు.
రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలి.
విబి జిరాంజీలో జలసిరి పనులను పెద్ద ఎత్తున చేపట్టాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల నవంబర్ 16 తెలంగాణ వార్తప్రతినిధి. గద్వాల. ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈనెల 19న ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
సోమవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధివిధానాలు, అమలు, నమోదు ప్రక్రియ, విబి జిరాంజీ పనులు, రబీ సాగు, చేయూత పెన్షన్లు, ఎస్ఐఆర్, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా, జీవిత బీమా భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందన్నారు.
ఆదాయంతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు దారులతో పాటు ఇతర అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హలేనని, కుటుంబాలన్నింటినీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న వివిధ బీమా పథకాలు కొన్ని వర్గాలకు, కొన్ని శాఖలకు మాత్రమే పరిమితమయ్యాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు.
ప్రతి కుటుంబం వివరాలను నమోదు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా సేకరించిన కుటుంబాల వివరాలు, పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న రేషన్ కార్డుల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలను కూడా సర్వే సమాచారం ఆధారంగా పరిశీలించి, పథకం పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలు, వార్డులలో అవసరానికి అనుగుణంగా ప్రత్యేక నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి, కుటుంబాలన్నీ తమ వివరాలను నిర్దేశిత ఫామ్ లో సులభంగా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. 18-59 ఏళ్లలోపు వారందరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.
నమోదు కేంద్రాల్లో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి, కుటుంబాల వివరాలను పరిశీలించి బీమా దరఖాస్తులను నమోదు చేయాలని తెలిపారు. నమోదు కేంద్రాల వివరాలు, తేదీలు, సమయాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. బీమా పథకంలో నామినీల ఎంపికకు సంబంధించి కుటుంబాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలన్నారు. బీమా మొత్తానికి ఒకరిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకొని తమకు నచ్చిన విధంగా బీమా మొత్తాన్ని పంపిణీ చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు.
దరఖాస్తులను పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అందులోని వివరాలను పూర్తిగా చదివి వినిపించి, వారికి అర్థమయ్యేలా వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాము ఏ పథకం కోసం సంతకం చేస్తున్నారో, ఎవరిని నామినీలుగా ఎంపిక చేసుకున్నారో ప్రతి కుటుంబానికి స్పష్టంగా తెలియాలని ఆదేశించారు.
ప్రతి ఇంటికీ పథకం సమాచారం చేరాలి.
నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాలు, పట్టణాల్లో పథకం అమలుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. అవసరమైన ప్రచార సామగ్రిని అందుబాటులో ఉంచి, ప్రతి కుటుంబానికి పథకంపై పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
మండలాల్లో ఎంపీడీవోలు క్యాంపుల నిర్వహణకు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. సర్పంచులు, కౌన్సిలర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సంబంధిత అధికారులకు ఈ పథకం విజయవంతం కావడానికి సహకరించేలా అవగాహన కలిగించాలన్నారు. దరఖాస్తుపై అర్హుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని అవసరమైన ఆధార్, రేషన్ కార్డులను తన వెంట ప్రజలు తీసుకొచ్చేలా ముందుగానే సూచించాలన్నారు.
రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలి.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున జిల్లాలోని రిజర్వాయర్లలో ఉన్న కొద్ది పాటి జలాలను వచ్చే వర్షాకాలం వరకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కాబట్టి రబీ సీజన్లో రైతులెవ్వరు ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దన్నారు. తమ పొలాల్లోనీ బోరు, బావుల్లో నీటి లభ్యత ఆధారంగా పప్పు దినుసులు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయవచ్చన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, యంత్రాల విషయంలో సంబంధిత ఏఈఓ లు, ఇతర అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తూ సహకరించాలని ఆదేశించారు.
విబి జీరాంజీ పనులను పెద్ద ఎత్తున కల్పించాలి.
కరువు పరిస్థితుల్లో రైతు కూలీలకు పెద్ద ఎత్తున విబి జీరాంజీ పనులను కల్పించాలని, ఎవరూ కూడా వలస పోయే పరిస్థితి రాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జలసిరి కార్యక్రమాల్లో భాగంగా పంట కుంటలు, ఇంకుడు గుంతలు వంటి జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విబి జిరాంజీలో ప్రతి గ్రామపంచాయతీలో రూ.1.0 కోటి విలువైన పనులను చేసుకునేందుకు అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చేయూత పెన్షన్లకు అర్హత సాధించిన వారందరికీ మంజూరు పత్రాల అందజేత ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అర్హులైన వారందరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు.
ఎన్నికల సంఘం తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు ఉండేలా సంబంధిత అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం తీసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిగ్రీ ఉత్తీర్ణులై మూడేళ్లు పూర్తయిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారందరూ తమ డిగ్రీ మెమో, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ పత్రాలను సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో ఆన్లైన్ లో చేసిన దరఖాస్తుకు జత చేసి అధికారులకు సమర్పించాల్సి ఉన్నందున పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు పొందేందుకు అప్లై చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, పలు శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.