🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 November 2026, 7:30 pm Posted by : Telangana Vaartha

ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత.. ఇద్దరితోనే 80 మంది విద్యార్థులకు బోధన

News Image
ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి.. కలెక్టర్‌ను ఆశ్రయించిన విద్యార్థులు, తల్లిదండ్రులు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని కురవపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయి. 8వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 80 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే విద్యాబోధన చేస్తున్నారు. గతంలో 150 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించినా పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీంతో సోమవారం నిర్వహించిన పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారు.

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, మరోవైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను ఎందుకు పరిష్కరించడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి కురవపల్లి ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్యాబోధన అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
🏠 Home