పొలంలో రైతు కష్టం...! మార్కెట్లో వ్యాపారుల ఇష్టం
రైతు కన్నీటి చుక్కలో వ్యవస్థ తప్పులు వెతుకు...!
మిల్లర్ల, వ్యాపారుల సిండికేట్ రాజ్యంలో రైతన్నల బతుకు చితుకు...!!!
కంట నీరే పంట నీరుగా బురద నుంచి బువ్వను తీసిన రైతన్నలు...!
విత్తనం దగ్గర అప్పు... రైతన్న జీవితాలకు ముప్పు... రైతు బాధలు తీర్చే వారెవరు చెప్పు...!
రైతుల బతుకులే నివురు గప్పిన నిప్పు..!!!
పంట దగ్గర ఆశ...అమ్మకం దగ్గర నిరాశ...!!!
అన్నం విలువ తెలిసిన సమాజానికి... అన్నదాత కన్నీటి విలువ తెలియకపోవటం సిగ్గుచేటు...!!
✍️ డాక్టర్ కృష్ణ బంటు, పీహెచ్డీ& గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జర్నలిజం, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
అతను ఒక మామూలు సాదాసీదా రైతు. పేద రైతు.బక్క చిక్కిన రైతు. బతుకే భారమైన రైతు. ఆర్థికంగా చితికిపోయిన రైతు.అప్పుల బాధలో కూరుకుపోయిన రైతు. ఏడాదికి ఏడాది ఎవుసం అప్పుల పరీక్షలు పెడుతున్నా ఏనాడైనా ఒక నాటికి డిస్టిక్షన్తో కాకుండా కనీసం పాస్ అయినా కానా అని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అమాయకపు విద్యార్థులాంటి ఆశల పల్లకిలో ఊరేగే రైతు. ప్రకృతి ప్రకోపాలకు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి, మిల్లర్లు, వ్యాపారుల సిండికేట్ మాయాజాలానికి, వడ్డీ వ్యాపారుల ఆవేశాలకు ఆహుతి అవుతున్న రైతు. తను పండించిన పంటకు తను రేటు నిర్ణయించుకోలేని రైతు. తన ఆరు గాలం కష్టానికి ఎవరో ఒకరు వచ్చి ముఖాన ఇంత పడేస్తే కిమ్మనకుండా ఇంటికి మొఖం మాడ్చుకుని వెళ్ళిపోయే రైతు. తన రెక్కల కష్టాన్ని ఎంతకు ఒకంతకు తెగ నమ్ముకుని అప్పుల బాధలు తీర్చుకోవాలనే ఆరాటపడే రైతు. తన ధాన్యానికి సరియైన రేటు రాకున్నా బియ్యం రేటు ఎంత ఉన్నా బతకడానికి తప్పకుండా వ్యాపారి చెప్పిన రేటుకు బియ్యం కొనుక్కొని తిని బతుకుదామని ఆశపడే ఒక బడుగు జీవి రైతు.
ఏటికి ఏతం పెట్టి ఎన్ని పుట్ల వడ్లు పండించినా.. గంజిలో మెతుకు ఎరగని బతుకులకు సజీవ సాక్ష్యం రైతు
ఆకాశం కరుణించకున్నా భూమిని నమ్ముకున్నాడు అతను. నీటి చుక్క కోసం ఎదురుచూస్తూ తన కన్నీటి చుక్కలనే పంటకు నీరుగా పంటలు పండించిన అలుపెరగని పారిశ్రామికుడు రైతు. అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ ఆరుగాలం శ్రమించి ధాన్యాన్ని రికార్డు స్థాయిలో పండించాడు. పంట చేతికొచ్చిందన్న ఆనందంతో మార్కెట్కు తీసుకువస్తే అక్కడ మరో పరీక్ష ఎదురవుతుంది. ప్రకృతి పెట్టిన అన్ని రకాల పరీక్షలను తట్టుకున్న రైతు తోటి మనిషి పెట్టిన పరీక్షలను మాత్రం తట్టుకోలేక చతికిల పడిపోయాడు. నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు అడపాదప కనపడుతూ అక్కడో ఇక్కడో మద్దతు ధర లభిస్తుంది కదా అంటూ వెళ్లిపోతే మిల్లర్లు, ధాన్యం వ్యాపారులు సిండికేట్ గా మారి రోజురోజుకు వడ్ల రేటును దిగజారిస్తే ఎవరికి చెప్పుకోవాలి. ఒకనాడు ఈ సీజన్లో పచ్చి వడ్లు కూడా మంచి రేటు వస్తున్నాయని ఆశపడ్డ రైతు నోట్లో మట్టి కొట్టారు సిండికేట్ వ్యాపారులు. రైతుల కష్టానికి తగిన ధర అంటే ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర మాట వినపడకుండా సిండికేట్ అడ్డుగా మారింది. ఇక రైతుకు గిట్టుబాటు ధర ఎవరు ఇవ్వాలి. ఎవరు నడుము కట్టాలి. ఎవరు రైతు జీవితాలను బాగు చేసేవారు. రైతులను కూడా ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకొని అధికారం చేత చిక్కించుకుని తర్వాత రైతుల కష్టాలు తమకేమీ పట్టవని తప్పించుకు తిరిగే రాజకీయ నాయకులదా తప్పిదం. అందిన కాడికి దోచుకుని తరతరాలుగా దాచుకునే వ్యవస్థకు అంకురార్పణం చేసిన సిండికేట్ వ్యాపారాలుగా ఈ తప్పిదం. నిత్యం పర్యవేక్షిస్తూ రైతులను కన్నబిడ్డ లాగా చూసుకొని సరియైన ధరలు వస్తున్నాయా రావడం లేదా అని పరిశీలించాల్సిన అధికారులుగా ఈ తప్పిదం. లేదా ప్రభుత్వ పాలకులదా ఈ తప్పిదం. ఎవరిని అడుగుదాం ఏమని అడుగుదాం అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ధర నిర్ణయంలో మాత్రం రైతు భాగస్వామ్యం లేకపోవడం ఏమాత్రం సమంజసం అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన కడుపు మాడ్చుకొని లోకం కడుపు నింపే రైతన్నకు మనము ఇచ్చే గౌరవం ఇదా...!
తిని తినక, నిద్ర సరిపోక, తన కడుపు మాడ్చుకుని లోకం కడుపు నింపే రైతన్నకు మనవిచ్చే గౌరవం ఇదే అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రైతు బాగుంటేనే లోకం బాగుంటుంది. వ్యవసాయం పండగ అయితేనే నిజంగా ఈ సమాజంలో అన్ని పండుగలు బాగుంటాయి. వ్యవసాయం దండగ అయిన నాడు ఏ వృత్తులు కూడా ఈ ప్రపంచంలో నడవవు, మూలకు పడాల్సిందే. ఈ ప్రపంచంలోని సమస్త వృత్తులన్నీ రైతులు పండించే పంటల ఆధారంగానే నిర్ణయించబడతాయి అన్న ఆర్థిక సూత్రం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవానికి రైతు ఈ సమాజానికి బుక్కెడు బువ్వ పెట్టే అన్నదాత. బురద నుంచి బువ్వను తీస్తే కమ్మగా ఉందని తినే మనమే మురికి బట్టల రైతును చూసి దూరంగా ఎందుకు ఉంచుతున్నాము, ఏమిటి అంటరానితనం అని, ఎందుకు వివక్ష అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. పంట పండించడం ఒక పోరాటం అయితే, పండించిన పంటకు ధర పొందడం మరో పోరాటంగా మారింది. చినుకు కోసం ఆకాశం వైపు చూసిన రైతు ఇప్పుడు తన ధాన్యానికి న్యాయమైన ధర కోసం మార్కెట్ వైపు దీనంగా చూస్తున్నాడు. రైతు శ్రమకు గౌరవం దక్కాల్సిన చోట సిండికేట్ ఆరోపణల మధ్య అతని ఆరుగాలం కష్టం అతి తక్కువ ధరకు అమ్ముడు అవుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. అన్నం పెట్టే చేతులకి కన్నీళ్లు మిగిలితే సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి కాదా అని ప్రతివారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన దుస్థితి.
కంటనీరే పంట నీరుగా... చెమట చుక్కలే దాన్యపురాశులుగా
కంటనీరే పంట నీరుగా, మట్టి నుండి మాణిక్యాలను తీసే రైతు చెమట చుక్కలే దాన్యపు రాశులుగా ఈ దేశపు ఆకలిని తీరుస్తున్నాయి. రైతు పండించిన గింజలో కేవలం అన్నం మాత్రమే లేదు. ప్రతి వడ్ల గింజలో రైతులు ఆశలు, ఆశయాలు, అప్పులు, ఆరుగాలం శ్రమ, ఆవేదన, మొత్తంగా రైతు జీవితం దాగి ఉన్నాయి. వడ్ల గింజకు ధర తగ్గించడం అంటే ఒక రైతు కష్టాన్ని మాత్రమే తక్కువ చేసినట్లు కాదు, మనిషిలోని మానవత్వాన్ని, మానవ సంబంధాలను, అన్ని కూడా ఆర్థిక కోణంలో చూస్తూ రైతులను తక్కువ చేసి చూసినట్లే అని భావించాల్సి వస్తుంది. వ్యాపారులో సిండికేట్ తో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలకే పరిమితం కావడంతో క్షేత్రంలో మాత్రం రైతుకు అన్యాయం జరుగుతుంది. వ్యాపారుల సిండికేట్ రైతుల పాలిట శాపంగా మారుతుంది పండిన పంటకు ధర లేకపోవడంతో రైతు చెమటకు విలువ లేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. రైతు చెమట చిందిస్తే దోచుకోవడం మాత్రం వ్యాపారుల వంతు అయింది. పంటలు పండించిన చేతులకు గిట్టుబాటు లేక ధరలు గతితప్పడంతో చేతికి చిప్ప వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. వానలో తడిసిన రైతు ఎన్నో కష్టాలకు ఓర్చి పంటలు పండిస్తే పట్నాలకు మార్కెట్లకు వచ్చినంక రైతులు వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. మట్టిలోంచి బంగారం పండిస్తూ బురదలో వచ్చి బువ్వని తీస్తున్న రైతులు నష్టానికి వడ్లను అమ్ముకొని అప్పులకు గట్టి తినడానికి మళ్లీ బియ్యం కొనబోతే భారీ ధర చూసి కళ్ళు బైర్లు కమ్మి కింద పడాల్సి వస్తుంది. వడ్లన్నీ రైతులు తెస్తున్నప్పుడు బియ్యాన్ని వ్యాపారులు ఎక్కువ రేట్లు అమ్ముకొని మధ్యన లాభం మాత్రం దళారీల పాలు అవుతుందన్న మార్కెట్ అమ్మకం కొనుగోలు సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. రైతు పండిస్తే బతుకు పంట భారం అయితే ఆ పంటను కొన్న వ్యాపారి బతుకు మాత్రం పూల పల్లకి అవుతుంది. రైతు శ్రమతో వ్యాపారుల జీవితాలు జల్సాలుగా మారుతున్నాయి.
ధాన్యం రైతులది.. ధరనేమో వ్యాపారిది... దోపిడీ మాత్రం సిండికేట్ ది
ఎంతకో ఒకంత రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని అప్పులు తీర్చుకుందాం అని ఆశపడ్డ రైతు జీవితంలో మాత్రం భంగపడ్డాడు. బియ్యం కొంటే భారంగా మారుతుంది. వరి పండిన చేలలో రైతుల కన్నీరు ఏరులై పారుతుంది. వ్యాపారులు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించి జల్సా చేసుకుంటున్నారు. వ్యాపారులందరూ సిండికేట్ గా మారి ఒకే మాట, ఒకే ధర చెప్పడంతో రైతు దెబ్బతింటున్నాడు. ముందే మాట్లాడుకున్న వ్యాపారులు వడ్ల ధరను తొక్కేసి దోపిడీకి తెరలేపారు. వ్యాపారులందరు కుమ్మక్కు అయ్యి రైతుల పంటను, వారి శ్రమను సిండికేట్ గా దోచేస్తున్నారు.
వడ్లకు రేటు ఉండదు...బియ్యానికి రెట్టింపు రేటు ఇదేలా సాధ్యం...?
వాస్తవానికి వడ్లకు రేటు లేదంటే బియ్యానికి కూడా రేటు తక్కువగా ఉండాలి. గత వానకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయింది. రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని బియ్యం గా మార్చి మార్కెట్లో సరిపడా నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ బియ్యం దొరకడం లేదని ఒక కృత్రిమ బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థను సృష్టించిన వ్యాపారులు బియ్యం రేట్లు తమకు ఇష్టం వచ్చినట్లు పెంచుకున్నారు. అయితే ఈ విషయంలో దృష్టి సారించిన ప్రభుత్వం బియ్యానికి రేట్లను ఫిక్స్ చేసింది. వడ్లకు గిట్టుబాటు ధర లేనప్పటికీ బియ్యానికి మాత్రం తగ్గుబాటు ధర కనిపించడం లేదు. అయితే కేవలం రైతు మాత్రమే నష్టపోవడం లేదు. బియ్యాన్ని వాడే ప్రతి వారు రేట్ల విషయంలో దోపిడీకి గురవుతున్నట్టుగా అంచనా వేయవచ్చు. రైతు దగ్గర వడ్లు తక్కువ ధరకు కొని మార్కెట్లో బియ్యాన్ని మాత్రం భారీగా ధర నిర్ణయించడంతో రైతులు, బియ్యాన్ని ఉపయోగించే వినియోగదారులు నష్టపోతుండగా వడ్లను బియ్యం గా మార్చిన మధ్యవర్తి, సిండికేట్ దారుడు, దళారీలు కోట్లకు పడగలెత్తుతున్నారు. రైతులకు భారంగా పెట్టుబడుల పోటు ఎలాగూ ఉంది, అందుకు తోడు ప్రకృతి ప్రకోపించింది. ఎల్ నినో రావడంతో పంటకు నీరు దొరకడం గగనం అయిపోయింది. వర్షాల జాడలేదు. మార్కెట్లో వ్యాపారుల సిండికేట్ జోరుగా సాగడంతో శ్రమించిన అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. పొలం నిండా పంట ఉన్నప్పటికీ రైతు గుండెలో మాత్రం ఆవేదన ఉంది. అప్పుల విత్తనాల సాగులో కన్నీటి కోతలు కోస్తూ రైతన్నకు కష్టాల మూటలు మిగలడం ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ కటోర సత్యం. చినుకు కోసం నిరీక్షణ, ధర కోసం నిరాశ, ఇదేనా రైతు జీవితానికి భరోసా అంటూ రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. సాగు చేయడమే ఒక సాహసం అయితే పంట అమ్మడం మరొక ప్రహసనంగా మారుతుంది. వాస్తవానికి రైతు బతుకు నిలబడితేనే ఈ దేశానికి అసలైన కళ. వాస్తవానికి రైతు లేకుంటే అన్నమే లేదు, అయితే రైతు కన్నీరు తుడిచే మనిషే లేరా ఈ సమాజంలో. అందుకే రైతు శ్రమకు గుర్తింపు ఎక్కడని, కర్షకుడు కన్నీటికి పరిష్కారం లేదని ఈ సమాజం ప్రశ్నిస్తుంది. అన్నదాతల ఆవేదనను ఈ సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంట పండించే రైతుకేమో కష్టాల పంట, కొనుగోలు చేసే వారికేమో లాభాల విందు, ఇది ఎంతకాలం కొనసాగుతుంది. భూమిని నమ్ముకున్న రైతుల అరకొరగా బతికే అతుకుల బొంత లాంటి జీవితాలు ధరల దెబ్బకు కూలిన ఆశల సౌధాలుగా మారాల్సిందేనా. రైతుల కడుపులో ధరలు సరిగ్గా రాక ఆకలి మంటలు మండుతుంటే ఈ సమాజం గుండెల్లో మానవత్వం మేల్కొనేది ఇంకా ఎంత కాలానికి. రైతుల బతుకు బారమైంది, వ్యవసాయం వ్యాపారుల చేతిలో బందీగా మారి బేరమైంది. చెమట చుక్కలు చిందించిన కర్షకుడు ధర తగ్గించిన వ్యాపారితో పోటీ పడలేక భావురుమంటున్నాడు. తనకు న్యాయం చేసే వారు ఎవరు అని ఏ దిక్కు లేక ఏదో ఒక దిక్కు వైపు రైతన్నలు ఆశగా,ఆబగా ఎదురుచూస్తున్నారు. లోకానికి అన్నం పెట్టే రైతు బతుకే ఒక కన్నీటి కావ్యంలా మిగిలిపోనుందా. నేలతల్లిని నమ్మి నాట్లు వేస్తే, తాను నమ్మిన ఈ సమాజంలోని మనుషులే నట్టేట ముంచితే, పుడమికి పచ్చని చీర కట్టించే రైతుకు కన్నీటి ధారలే మిగిలాయా. వాస్తవానికి రైతు బతుకు పండితేనే సమాజపు మనుగడకు నిజమైన పండుగ.
అధికారులు.. పాలకులారా.. పరిశీలించండి..!
వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా మద్దతు ధర ప్రకటిస్తుంది. కనీసం ఆ మద్దతు ధర కైనా రైతులు వడ్లు అమ్ముకునే పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఎలాగూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పట్లో రాదు. రైతు తాను పండించిన పంటకు తానే రేటు చెప్పి గిట్టుబాటు అయితేనే ఇచ్చే వ్యవస్థ కోసం మనం పోరాడ వలసిన అవసరం ఉంది. గిట్టుబాటు ధర సంగతి ఏమోగానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా సరిగా అందకపోతే, ఏవో లోపాలు ఉన్నాయని, తేమ సరిగా లేదని, ధాన్యం పరిశుభ్రంగా లేదని పలు రకాలుగా కోతలు విధిస్తూ వ్యాపారులు నానా రకాల వంకర టింకర వాదనలు వినిపిస్తూ అందిన కాడికి దోచుకునే వారిలాగా కాకుండా ఒక రైతు ఎంత కష్టపడితే మార్కెట్కు ధాన్యం వస్తుందో ఆలోచించి మరీ వ్యత్యాసం లేకుండా సరియైన ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మద్దతు ధర అనేది బాగా పెంచి పాలకులు కూడా రైతు పక్షపాతులే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల కోసం అది చేస్తున్న ఇది చేస్తున్నాం అని గొప్పలు పోవడం కాకుండా వాస్తవంగా మాటల్లో కాకుండా చేతల్లో చూపించి సరైన ధర రైతులకు ఇప్పించి రైతుల జీవితాలను తద్వారా మంచి సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం పాలకులదే అని చెప్పక తప్పదు. ఆ దిశగా అధికారులు,పాలకులు కలిసి రైతులకు సరైన ధర అందేలాగా చర్యలు తీసుకుంటారని, సిండికేట్ వ్యవస్థకు చరమగీతం పాడుతారని మనమూ ఆశిద్దాం.