🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 November 2026, 7:15 pm Posted by : Telangana Vaartha

ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి

News Image
డిమాండ్లు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ హెచ్చరిక

సూర్యాపేట: ఆశా వర్కర్లకు కనీసం రూ.18 వేల వేతనం అమలు చేయాలని, వారి న్యాయమైన హక్కులను వెంటనే కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో నేడు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట సుమారు 200 మంది ఆశా వర్కర్లతో భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు గౌరవప్రదమైన వేతనం, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఆశా వర్కర్ల డిమాండ్స్
1. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి.
2. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి.
3. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి అండగా రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
4. ప్రతి ఆదివారం, పండుగ సెలవులతో పాటు సంవత్సరానికి 60 రోజుల క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలి.
5. రెండవ పీఆర్సీ అమలు చేసి ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలి.
6. ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు అర్హత ఆధారంగా ప్రమోషన్లు కల్పించాలి.
7. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి.

ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ నకిరేకంటి కవిత మాట్లాడుతూ

ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కేవలం హామీలతో కాలయాపన చేయకుండా ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే ఆశా వర్కర్లందరినీ ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఆశా వర్కర్ల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవప్రదమైన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు పి అరుణకుమారి ఉపాధ్యక్షులు హుస్సేని ప్రధాన కార్యదర్శి పి రాధ కార్యదర్శి సుజాత.విజయ గోవర్ధన సబితా ఉమా సరస్వతి తదితరులు పాల్గొన్నారు
🏠 Home