🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 November 2026, 1:12 pm Posted by : Telangana Vaartha

NHDC ఆఫీసర్ B.S. గణేశా పై దాడికి యత్నం

News Image
మదనపల్లిలో చేనేత కళాకారుల ఆందోళన
చేనేత కళాకారులకు తెలియకుండానే యార్న్ సబ్సిడీ పాసుబుక్కుల జారీ
చేనేత కళాకారుల సబ్సిడీ డబ్బు కొట్టేసిన దళారులు
సంఘటనపై విచారణ చేపట్టిన NHDC కమర్షియల్ మేనేజర్ జితేంద్ర తోలంబియా
సంవత్సరాలు గడిచినా న్యాయం జరగలేదు
రాజకీయ పోరాట దిశగా చేనేత కళాకారుల ప్రణాళిక
నిజమైన చేనేత కళాకారులకు తెలియకుండానే వారి పేర్లతో యార్న్ సబ్సిడీ పాస్‌బుక్కులు జారీ చేసి, వారి ఖాతాలకు రావాల్సిన సబ్సిడీ ప్రయోజనాలను మధ్యవర్తులు, దళారులు స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై బాధితులు ఫిర్యాదులు చేసినా, సంబంధిత ఆధారాలు సమర్పించినా న్యాయం జరగకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
2017 అక్టోబర్ 13న చేనేత నాయకుడు మాచర్ల మోహన్ రావు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లి లోని నీరుగట్టువారిపల్లి లో చేనేత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NHDC ప్రాంతీయ అధికారి బి.ఎస్. గణేశా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కళాకారులు తమకు తెలియకుండానే తమ పేర్లతో NHDC కార్యాలయం యార్న్ సబ్సిడీ పాస్‌బుక్కులు జారీ చేసిందని, తమకు రావాల్సిన సబ్సిడీ డబ్బులను మధ్యవర్తులు స్వాధీనం చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సంబంధిత కార్యాలయ సిబ్బంది పాత్రపైనా ప్రశ్నలు లేవనెత్తారు. బాధితుల ఆరోపణలపై పారదర్శకంగా స్పందించి, వారి సమస్యను పరిష్కరించాల్సిన అధికారి వైఖరిపై చేనేత కళాకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, ఆగ్రహానికి గురైన కొందరు కళాకారులు కుర్చీలు విసిరే స్థాయికి వెళ్లింది. చివరకు తీవ్ర గందరగోళం మధ్య సమావేశం ముగిసింది. ఈ విషయం పలు వార్తాపత్రికలలో సైతం ప్రచురితమైంది.
ఈ ఘటనపై మాచర్ల మోహన్ రావు కేంద్ర జౌళి శాఖ కు ఫిర్యాదు చేశారు. చేనేత కార్మికుల పేర్లతో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమ పాస్‌బుక్ జారీ, సబ్సిడీ దుర్వినియోగం, అధికారుల బాధ్యత వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో 2025 జూలై 15న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ (NFHH) నాయకుడు మాచర్ల మోహన్ రావు తో NHDC కమర్షియల్ మేనేజర్ జితేంద్ర తోలంబియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించారు.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. 2017లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై ఫిర్యాదులు, ఆధారాలు ఉన్నప్పటికీ బాధితులకు ఇప్పటివరకు న్యాయం ఎందుకు జరగలేదు? విచారణ నిర్వహించడం మాత్రమే సరిపోతుందా? ఆరోపణల్లో నిజానిజాలు తేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి లేదా? ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారులు సమర్పించినట్లు చెబుతున్న ఆధారాలు అత్యంత కీలకమైనవి.
1. ఫోర్జరీకి గురైనట్లు ఆరోపిస్తున్న లబ్ధిదారుల పేర్లు.
2. సంబంధిత సబ్సిడీ కార్డుల నంబర్లు.
3. పాస్‌బుక్కులు జారీ చేసిన తేదీలు.
4. యార్న్ సరఫరా చేసినట్లు చూపిన సప్లయర్ల వివరాలు.
5. అనుమానాస్పద లేదా నకిలీ లెడ్జర్ రసీదులు (Fake LR).
6. రవాణా జరిగినట్లు చూపిన ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు.
సబ్సిడీ ఎవరి పేరుతో మంజూరైంది?
ఆ ప్రయోజనం వాస్తవంగా ఎవరికి చేరింది?
యార్న్ ఎవరు తీసుకున్నారు?
సరఫరా నిజంగా జరిగిందా?
బిల్లులు అసలైనవేనా?
అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. కేవలం కాగితాలపై లబ్ధిదారుల పేర్లు ఉన్నంత మాత్రాన వారికి ప్రయోజనం అందినట్లు ఎలా భావిస్తారు?
లబ్ధిదారుడి సమ్మతి లేకుండా పాస్‌బుక్ జారీ జరిగిందా?
నకిలీ పత్రాల ఆధారంగా సబ్సిడీ క్లెయిమ్ చేశారా?
ఇందులో అధికారుల పాత్ర ఏమైనా ఉందా?
అన్నది స్వతంత్ర విచారణలో తేలాల్సిన అంశం. ఒకవైపు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిజమైన చేనేత కళాకారులకు అందించాలనే లక్ష్యం. మరోవైపు ఆ కళాకారుల పేర్లనే ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు. ఈ రెండు విరుద్ధ పరిస్థితుల మధ్య నలిగిపోతున్నది మాత్రం అసలైన చేనేత కళాకారుడే.
ఒక బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకువెళితే, అతని ఫిర్యాదును నిర్ణీత సమయంలో విచారించి న్యాయం చేయడం ప్రభుత్వ సంస్థల కనీస బాధ్యత. విచారణ పేరుతో సంవత్సరాలు గడిచిపోతే, బాధితుల్లో వ్యవస్థపై నమ్మకం ఎలా నిలుస్తుంది ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడం, విచారణను తేల్చకపోవడం వల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు పరోక్షంగా ప్రయోజనం కలిగే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ వ్యవహారంలో విచారణ జాప్యానికి కారణాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఇప్పటివరకు చేనేత నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. పత్రాలు సమర్పించారు. విచారణలకు హాజరయ్యారు. న్యాయం కోసం ఎదురుచూశారు. అయినప్పటికీ బాధితుల సమస్యకు పరిష్కారం లభించకపోతే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించడం వారికి ఉన్న హక్కు. ఈ నేపథ్యంలో చేనేత నాయకులు ఇక ఈ సమస్యను కేవలం అధికారుల పరిధిలోని పరిపాలనా ఫిర్యాదుగా కాకుండా, దేశవ్యాప్తంగా చేనేత కళాకారుల హక్కులకు సంబంధించిన రాజకీయ, సామాజిక ఉద్యమంగా మలచాలని భావిస్తున్నారు. అవసరమైతే న్యాయపోరాటంతో పాటు వీధి పోరాటాలకు కూడా సిద్ధమవుతున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రభావానికి తావులేకుండా స్వతంత్ర విచారణ జరపాలి. సంబంధిత లబ్ధిదారులను ప్రత్యక్షంగా విచారించాలి. ఫోర్జరీ ఆరోపణలు, నకిలీ LRలు, రవాణా బిల్లులు, సబ్సిడీ చెల్లింపులపై ఫోరెన్సిక్ సహా అవసరమైన సాంకేతిక పరిశీలన జరపాలి. అక్రమాలు రుజువైతే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన అసలైన చేనేత కళాకారులకు వారి హక్కులను తిరిగి అందించాలి. లేకపోతే ఈ సమస్యను దేశవ్యాప్తంగా చేనేత ఉద్యమంగా తీసుకెళ్లి, కేంద్ర జౌళి శాఖ, NHDC ఉన్నతాధికారుల కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు నిర్వహించడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చేనేత నాయకులు హెచ్చరిస్తున్నారు.

యర్రమాద వెంకన్న నేత
వ్యవస్థాపకులు, చేనేత దినోత్సవం
🏠 Home