ఆర్టీఐ దరఖాస్తులంటే అధికారులకు లెక్కలేదా
జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి.. నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఆర్టీఐ చట్టంపై అధికారులకు అవగాహన కల్పించాలి సామాజిక కార్యకర్త హెచ్.శాంతన్న
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన సామాజిక ఆర్ టీ ఐ కార్యకర్త శాంతన్న గారు ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం–2005 అమలులోనే అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని సామాజిక ఆర్టీఐ కార్యకర్త హెచ్.శాంతన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ధనంతో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి ఖర్చుల వివరాలు అడిగితే సమాధానం ఇవ్వకుండా దరఖాస్తునే తిరిగి పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సింగిల్ విండో కార్యాలయం, మండల పరిధిలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 2021 నుంచి 2026 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, రైతుల అభివృద్ధి, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన కోసం చేసిన ఖర్చుల పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ అక్టోబర్ 13న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఆర్టీఐ దరఖాస్తు పంపించారు.రెండు విభాగాలకు సంబంధించి మొత్తం 24 అంశాలతో 13 పేజీల దరఖాస్తు సమర్పించారు. ప్రతి సంవత్సరం వచ్చిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, చేపట్టిన పనుల ప్రదేశాల ఫొటోలు, బిల్లులు, రసీదులు, ఎంబీ బుక్స్, మిగిలిన నిధుల వివరాలను అందించాలని కోరారు.
పంపిన దరఖాస్తునే తిరిగి పంపిన వైనం!
సమాచారం అందించాల్సిన జిల్లా కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ నుంచి తాను పంపిన దరఖాస్తులోని అంశాలనే తిరిగి తనకు పంపించారని శాంతన్న తెలిపారు. ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సమాచారం అందించాల్సింది పోయి, దరఖాస్తునే తిరిగి పంపడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
మా కార్యాలయానికి ఆర్టీఐ వర్తించదు?
మానవపాడు మండల సింగిల్ విండో సహకార సంఘం సీఈఓ శ్రీనివాసరెడ్డిని ఫోన్లో సంప్రదించి దరఖాస్తు వివరాలు అడగగా, డీసీఓ కార్యాలయం నుంచి వాట్సాప్‌లో దరఖాస్తు ఫారం పంపించారని, తమ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం వర్తించదని జిల్లా సూపరింటెండెంట్ డీసీఓ మన్నేశ్వరి తెలిపినట్లు ఆయన వివరించారు. అసలు పీఏసీఎస్ కార్యాలయానికి ఆర్టీఐ చట్టం వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఫోన్ చేసినా సమాధానం ఇవ్వని విద్యాశాఖ అధికారులు!
జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మిని సంప్రదించి తమ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు వచ్చిందా? అని ప్రశ్నించగా, తాను సెలవులో ఉన్నానని సమాధానం ఇచ్చారని శాంతన్న తెలిపారు. కనీసం సంబంధిత ప్రజా సమాచార అధికారి (పీఐఓ) వివరాలు, ఫోన్ నంబర్ అడిగినా స్పందించకుండా ఫోన్ కట్ చేశారని ఆరోపించారు.అలాగే మానవపాడు మండల విద్యాధికారి శివప్రసాద్‌ను సంప్రదించి జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా డీఈఓ కార్యాలయం నుంచి ఆర్టీఐ దరఖాస్తు వచ్చిందా? అని అడగగా, కార్యాలయానికి వెళ్లి చూస్తానని చెప్పారని తెలిపారు. సంబంధిత కార్యాలయాల నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.
నెల రోజులైనా జవాబుదారీతనం ఏది?
అక్టోబర్ 13న దరఖాస్తు చేసుకోగా నవంబర్ 13 నాటికి నెల రోజులు పూర్తయినా సమాచారం అందకపోవడంపై శాంతన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం సాధారణంగా 30 రోజుల్లో సమాచారం అందించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. గడువులోగా సమాచారం ఇవ్వకపోతే మొదటి అప్పీల్ చేసుకునే హక్కు దరఖాస్తుదారుడికి ఉందని, ఈ నేపథ్యంలో మొదటి అప్పీల్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టంపై అధికారులకు కనీస అవగాహన ఉందా? ప్రతి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? లేక చట్టాన్ని నీరుగారుస్తున్నారా? అని ప్రశ్నించారు.
కలెక్టర్ గారు స్పందించాలి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి!
జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరిపించి సంబంధిత శాఖల అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని హెచ్.శాంతన్న కోరారు. ఆర్టీఐ దరఖాస్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారుల వివరాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచార హక్కు చట్టం–2005పై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించాలని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలకు ఆర్టీఐపై అవగాహన కల్పించాలని కోరారు. దరఖాస్తుదారులకు నిర్ణీత సమయంలో సమాచారం అందించేలా జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ నిధులు, అభివృద్ధి పనుల ఖర్చుల వివరాలు అడిగినప్పుడు పారదర్శకంగా సమాచారం అందిస్తే ఎలాంటి అనుమానాలకు తావుండదని, సమాచారం ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. అవినీతి జరిగిందని తాను నిర్ధారించడం లేదని, నిధుల వినియోగంపై పూర్తి సమాచారం అందించాలని మాత్రమే కోరుతున్నానని స్పష్టం చేశారు.నెల రోజుల గడువు పూర్తయినందున మొదటి అప్పీల్ దాఖలు చేయడంతో పాటు అవసరమైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సామాజిక కార్యకర్త, ఆర్టీఐ కార్యకర్త హెచ్.శాంతన్న గారు తెలిపారు.