🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 November 2026, 8:06 pm Posted by : Telangana Vaartha

ఇనాం భూమిలో అక్రమ ప్లాట్ల దందా.. తహశీల్దార్‌కు ఫిర్యాదు

News Image
ఉప్పల గ్రామ సర్వే నెంబర్ 28/అ1 లోని దేవాదాయ శాఖ ఇనాం భూమిలో అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్న ప్లాట్ల మాఫియా.

నకిలీ పత్రాలతో ప్రజలను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసి కమిషన్లు దండుకుంటున్న వైనం.
జోగులాంబ గద్వాల 13 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. అయిజ. మండలం ఉప్పల గ్రామంలో ప్లాట్ల మాఫియా రెచ్చిపోతోంది. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 28/అ1 లో ఉన్న భూమి గతంలో దేవాదాయ శాఖకు సంబంధించిన ఇనాం భూమిగా ఉందని, అప్పట్లో దేవాలయ పూజారికి పూజా కార్యక్రమాలు, సేవల నిర్వహణ నిమిత్తం ఈ స్థలాన్ని కేటాయించినట్లు స్థానికంగా సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం సదరు భూమిలో కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు, ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ లేకపోయినా ప్లాట్లు ఏర్పాటు చేసి ఇతరులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూజారి తమకు విక్రయించారని కొందరు వ్యక్తులు చెబుతూ అమాయక ప్రజలకు ఎలాంటి అనుమతులు లేని నకిలీ పత్రాలు చూపించి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇనాం భూములను అసలు లబ్ధిదారులు కేవలం అనుభవించడానికి మాత్రమే వీలుంటుంది తప్ప, వారి తర్వాతి తరాలకు వారసత్వంగా మాత్రమే సంక్రమిస్తాయి గానీ బయటి వ్యక్తులకు విక్రయించడానికి ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవు.
ఈ అక్రమ దందాపై ఉప్పల గ్రామానికి చెందిన బి. రామాంజనేయులు అయిజ తహశీల్దార్‌కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. సర్వే నెంబర్ 28/అ1 కి సంబంధించిన పాత ఇనాం రికార్డులు, దేవాదాయ శాఖ రికార్డులను పరిశీలించి, అసలు భూమి యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో పూర్తి విచారణ జరపాలని కోరారు. అలాగే అక్రమంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్న వ్యక్తులపై తగిన అనుమతులు ఉన్నాయో లేదో తేల్చి, నిబంధనల ప్రకారం తదుపరి రిజిస్ట్రేషన్లు, లేఅవుట్ అనుమతులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మరియు దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ కోసం జిల్లా కలెక్టర్ మరియు తహశీల్దార్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
🏠 Home