రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
బ్లాక్స్పాట్ల గుర్తింపు,లైటింగ్, పార్కింగ్,పెట్రోలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులంబ గద్వాల13 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేస్తూ, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారితో పాటు అంతర్రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో ఉన్న సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జాతీయ రహదారిపై పెండింగ్‌లో ఉన్న భద్రతా పనులను వేగంగా పూర్తి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను ఆదేశించారు. టోల్ ప్లాజాలు, హోటళ్ల వద్ద సర్వీస్ రోడ్లపై వాహనాల పార్కింగ్‌ను నియంత్రించి నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా చర్యలు చేపట్టాలన్నారు. టోల్ ప్లాజాలు, ముఖ్యంగా మలుపుల వద్ద అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్, పెట్రోలింగ్ సేవలను చురుకుగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో టోల్‌ఫ్రీ సేవలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు. ఎర్రవల్లి ఎక్స్ రోడ్ వద్ద జోగులాంబ గద్వాల జిల్లాను సూచించే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అలంపూర్ జోగులాంబ ఆలయానికి వెళ్లే దిశ, దూరాన్ని స్పష్టంగా తెలిపే సూచిక రహదారిపై బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా జిల్లాకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆలయానికి చేరుకునే మార్గం సులభంగా ఉంటుందని తెలిపారు. రాయచూర్, అయిజ, గట్టు, ఎర్రవల్లి రోడ్డులను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టి రహదారి భద్రతను మెరుగుపరచాలని ఆదేశించారు. హైవేలు, ప్రధాన రహదారులపై నిరంతర పెట్రోలింగ్, ట్రాఫిక్ పర్యవేక్షణ చేపట్టి అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌ను కట్టడి చేస్తూ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. హైవేలపై ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆపకుండా నిర్దేశిత బస్స్టాప్లలోనే నిలిపేలా డ్రైవర్లకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. హైవేలు, గ్రామీణ రహదారుల వద్ద ఉన్న వైన్ షాపులను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలన్నారు. సరైన పార్కింగ్, మద్యం సేవించేందుకు అవకాశం లేకుండా చూడడం, వ్యర్థాల నిర్వహణతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వైన్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఆర్టీఓ అధికారులు హైవేలు, ప్రధాన రహదారులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా పాఠశాలల బస్సుల ఫిట్నెస్ను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ, ఆర్అండ్బీ, ఎన్ హెచ్ఏఐ, తదితర శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ రహదారి భద్రతను మరింత పటిష్టం చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్అండ్ బి ఈఈ ప్రగతి, డిటిఓ రాధిక, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు, సంబంధిత శాఖల ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.