🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 November 2026, 7:57 pm Posted by : Telangana Vaartha

గంజాయి అక్రమ రవాణా.. ముఠా గుట్టురట్టు

News Image
112 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.25 లక్షల విలువైన గంజాయి పట్టివేత.
- ఇన్నోవా కారులో 41 ప్యాకెట్లలో గంజాయి తరలింపు.
- గంజాయి రవాణాకు ఉపయోగించిన ఇన్నోవా కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం.
- ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలింపు.
- ఎస్కార్ట్‌గా మరో కారును ముందు నడుపుతూ పోలీసుల కదలికలపై నిఘా.
- కారు బ్రేక్‌డౌన్ కావడంతో వాహనాన్ని వదిలి పరారీ.
- తిరిగి వాహనాన్ని తీసుకెళ్లేందుకు సూర్యాపేటకు వచ్చిన ఇద్దరు నిందితుల అరెస్ట్.

గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఏమాత్రం ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ వెల్లడించారు.

సూర్యాపేట: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఇందులో భాగంగా సూర్యాపేట II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 112 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు పథకం రూపొందించారు. ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథపురి ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో రూ.2,000 చొప్పున మొత్తం 112 కిలోల గంజాయిని రూ.2.24 లక్షలకు కొనుగోలు చేశారు. అనంతరం గంజాయిని 41 ప్యాకెట్లుగా తయారుచేసి ఇన్నోవా కారులో లోడ్ చేసి మహారాష్ట్రకు తరలించేందుకు బయలుదేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మరో ఎర్టిగా కారును ఎస్కార్ట్‌గా ముందు నడుపుతూ, పోలీసుల కదలికలను గమనిస్తూ వెనుక వస్తున్న ఇన్నోవా వాహనానికి సమాచారం అందించేవారు. ఈ క్రమంలో నవంబర్ 7వ తేదీన సూర్యాపేట పట్టణ శివారులోని NH-65 జాతీయ రహదారిపై పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో ఇన్నోవా కారు బ్రేక్‌డౌన్ అయింది. దీంతో నిందితులు వాహనాన్ని రహదారి పక్కన వదిలి పరారయ్యారు. అనుమానాస్పదంగా కారు నిలిపి ఉన్నట్లు సమాచారం అందడంతో సూర్యాపేట II టౌన్ ఎస్సైలు కె. గోపికృష్ణ, బి. రామచంద్రం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని తనిఖీ చేయగా, 41 ప్యాకెట్లలో 112 కిలోల గంజాయి గుర్తించారు. వెంటనే పంచుల సమక్షంలో గంజాయితో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా వాహనాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు నవంబర్ 12వ తేదీన సూర్యాపేటకు వచ్చిన ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు గంజాయి అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు వెల్లడైంది.

అరెస్టయిన నిందితులు:

1. ఆకాష్ విజయ్ దాబేకర్ (23), బీడ్ జిల్లా, మహారాష్ట్ర.
2. ఆకాష్ దిలీప్ మోరే (32), బుల్దానా జిల్లా, మహారాష్ట్ర.

వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, కొనుగోళ్లు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పోలీసు సిబ్బందికి అభినందనలు..

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ వెంకటయ్య, సిబ్బంది ఎస్ఐ లు గోపికృష్ణ, రామచందర్, ఉన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సూర్యాపేట II టౌన్ ఎస్సైలు కె. గోపికృష్ణ, రామచందర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు, కానిస్టేబుళ్లు కొండా రమేష్, ఎన్. నవీన్‌లను ఎస్పీ అభినందించారు.
🏠 Home