🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 November 2026, 7:55 pm Posted by : Telangana Vaartha

గోదావరి పుష్కరాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక

News Image
భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలి
ఘాట్ల అభివృద్ధి, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, రహదారులు, వైద్య సదుపాయాల ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకొని భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించి, అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయం లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భక్తులకు వసతి, భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలన్నారు. సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట ఐటీసీ వంటి సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సహకారాన్ని పరిశీలించాలని సూచించారు.
భద్రాచలం ఆలయానికి చేరుకునే రహదారుల అభివృద్ధికి సంబంధించి వంతెన నుంచి ఆలయం వరకు సుమారు రూ.14 కోట్లతో, బండ్‌ నుంచి ఆలయం వైపు సుమారు రూ.2.60 కోట్లతో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. రహదారుల అభివృద్ధి పనుల విషయంలో రోడ్లు, భవనాల శాఖ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన అంచనాలను సిద్ధం చేసి పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హామ్ రహదారుల మరమ్మతులు, ఒప్పందాలకు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించి రహదారులపై ప్రయాణం సాఫీగా జరిగేలా చూడాలన్నారు.
ఈ సందర్భంగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ భద్రాచలం పరిధిలో గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు, ప్రస్తుతం ఉన్న ఘాట్ల మరమ్మతులు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సురక్షితంగా స్నానాలు ఆచరించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి వివరించారు. ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, భక్తుల రాకపోకలకు అనువైన మార్గాలు, రద్దీ నియంత్రణకు అవసరమైన చర్యలను వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కొత్త ఘాట్ల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న ఘాట్ల మరమ్మతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దుమ్ముగూడెం ఘాట్‌ మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదించిన పనులను వేగవంతం చేయాలని, బూర్గంపాడు మండలం మోతే వద్ద వీఐపీ ఘాట్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ ఏరియాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. సారపాకలోని పుష్కరవనం పరిధిలో ఉన్న సుమారు 75 ఎకరాల స్థలాన్ని పరిశీలించి, అక్కడి చెట్లకు నష్టం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లకు అనువైన ప్రణాళిక రూపొందించాలన్నారు. అవసరమైతే సమీపంలోని అటవీ శాఖకు చెందిన యూకలిప్టస్ ప్లాంటేషన్, ఇతర ప్రభుత్వ భూములు, ప్రైవేటు వ్యవసాయ భూములను కూడా పరిశీలించాలని సూచించారు. గుర్తించిన స్థలాలు సరిపోకపోతే అదనంగా మరో 30 ఎకరాల వరకు అనువైన భూమిని గుర్తించడంతో పాటు సుమారు 10 ఎకరాలను ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
ప్రైవేటు భూములను పార్కింగ్ లేదా ఇతర అవసరాలకు వినియోగించాల్సి వస్తే రైతులతో ముందుగానే చర్చించి, పంట నష్టం, భూమి వినియోగానికి సంబంధించిన పరిహారంపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. చివరి నిమిషంలో భూ వివాదాలు తలెత్తకుండా కనీసం ఆరు నెలల ముందుగానే రైతులతో సంప్రదింపులు జరపాలన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పార్కింగ్, హోల్డింగ్ ఏరియాలకు అనువైన స్థలాలను పరిశీలించాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. వాహనాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా నిర్ధారించడంతో పాటు పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ ఏరియాలను గుర్తించి ట్రాఫిక్ నిర్వహణ చేపడతామన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో సూచిక బోర్డులు, రేడియం, ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లోనూ రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల భద్రత, రద్దీ నియంత్రణకు అవసరమైన పోలీసు బందోబస్తు కల్పిస్తూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు.

పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో అనుసరించిన విధానాన్ని పరిగణనలోకి తీసుకొని క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు తాగునీటి సరఫరా, రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఘాట్ల వద్ద, క్యూలైన్లలో తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేయాలని, ప్రసాదం కౌంటర్లు, ఫుడ్‌ కోర్టులు, అన్నదాన కేంద్రాలకు అనువైన స్థలాలను గుర్తించాలని తెలిపారు.

భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా భద్రాచలం, పర్ణశాల ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించి, తగిన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లతో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. తాత్కాలిక వైద్య శిబిరాలు, ఇతర తాత్కాలిక సదుపాయాల ఏర్పాటుకు వాటర్‌ప్రూఫ్‌ టెంట్లను వినియోగించాలని సూచించారు.

ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకల మార్గాలు, శానిటరీ కాంప్లెక్స్‌ల వద్ద నిరంతర పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. చెత్త తొలగింపు, మరుగుదొడ్ల శుభ్రత, తాగునీటి సరఫరా నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్నారు. పుష్కరాల సమయంలో భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించేందుకు గెస్ట్‌హౌస్‌లను గుర్తించాలని, వీఐపీల వసతి, వాహనాల కాన్వాయ్‌ పార్కింగ్‌, పరిసరాల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్‌ పనులపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

పుష్కరాల సందర్భంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా అటవీ ప్రాంతాల్లో పర్యాటక కాటేజీలు, క్యాంపింగ్‌ సదుపాయాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల పర్యాటకులకు అదనపు సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యాటక ఆదాయం పెంపునకు అవకాశం ఉంటుందన్నారు.

అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని, కేవలం ప్రాథమిక అంచనాలతో కాకుండా అవసరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వివరణాత్మక ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత కన్సల్టెంట్‌ ఏడు రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని, తాత్కాలిక సదుపాయాల ఏర్పాట్లకు సంబంధించి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతిపాదనలను ఉన్నతస్థాయిలో సమర్పించి అవసరమైన ఆమోదాలు పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పుష్కరాల ఏర్పాట్లలో ఏ శాఖకు సంబంధించిన పనులైనా పరస్పర సమన్వయంతో పూర్తి చేయాలని, సమావేశాల్లో ఒకరిపై మరొకరు బాధ్యతలు నెట్టివేయకుండా సమస్యలను సబ్‌ కలెక్టర్‌ లేదా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తయ్యేలా అధికారులు నిర్దిష్ట గడువులతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డి పి ఓ అనూష,సీపీఓ సునీత , , దేవాదాయ శాఖ ఈఓ దామోదరరావు , నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, పర్యాటక శాఖ, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ, డీపీఆర్వో, సంబంధిత మండలాల తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home