🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 November 2026, 7:18 pm Posted by : Telangana Vaartha

ఇంటర్ బోర్డు రద్దు

News Image
- తెలంగాణలో ఇంటర్మీడియట్‌కు ప్రత్యేక విధానం ఇక ఉండదు
- 2027–28 విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలు
- ఇంటర్ విద్య పాఠశాల విద్యలో విలీనం..
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ న్యూస్ డెస్క్ : తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం 2027–28 నుంచి ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానానికి బదులుగా 10+2 విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల ద్వారా నిర్వహిస్తున్న 11, 12వ తరగతులను పాఠశాల విద్యా వ్యవస్థలో విలీనం చేయనున్నారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంస్థలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

కొత్త విధానంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా, 5 నుంచి 8వ తరగతి వరకు తదుపరి విద్యా దశగా, 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యా దశగా ఏర్పాటు చేయనున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించడంతో పాటు, 12వ తరగతి అనంతరం నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాల్లో ఉన్న తరహాలో విద్యార్థులకు నిరంతర విద్యా విధానం అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. పదో తరగతి అనంతరం విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయకుండా, పాఠశాల స్థాయి నుంచే ఉన్నత విద్య వరకు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంస్కరణలు అమలులోకి రావాలంటే అవసరమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, బోధనా సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని సూచించారు. కొత్త విధానం వల్ల ఏ ఒక్క విద్యార్థికీ ఇబ్బంది కలగకుండా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.

జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సేవా, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు సమాచారం.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2027–28 నుంచి అమలుకానున్న ఈ విద్యా సంస్కరణలతో తెలంగాణ విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
🏠 Home