సూర్యాపేట జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి
కరువును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువునిధులను వెంటనే విడుదల చేయాలి.
సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపు
ఎల్ నీ నో ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు ప్రభావంతో, వర్షాభావం, నీటి ఎద్దడి కారణంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, వ్యవసాయం చేయలేని దుస్థితి ఏర్పడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 200 మంది తో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో (A O) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో వర్షాభావం, నీటి కొరత కారణంగా సాగు ప్రశ్నార్థకంగా మారిందని, వేసంగి రబీ పంటలు సాగు చేసుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులు అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువును జాతీయ విపత్తు గా ప్రకటించి కరువు నిధులను తక్షణమే రైతులకు అందించాలని కోరారు. అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం నిర్వహించి, కరువు నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ ప్రధాన డిమాండ్లు:
1. సూర్యాపేట జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి.
2. నవంబర్ లో కలెక్టరేట్లో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం నిర్వహించాలి.
3. వ్యవసాయానికి కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి.
4. తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.
5. రబీ, వేసంగి పంటలు సాగు చేయలేని రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి.
6. కౌలు రైతులను గుర్తించి వారికి కూడా పంట నష్టపరిహారం అందించాలి.
7. కరువు పరిస్థితుల్లో చౌకధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి.
8. ఉపాధి కోల్పోతున్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక ఉపాధి పథకం అమలు చేయాలి.
పంటల వారీగా నష్టపరిహారం చెల్లించాలి:
- వరి పంటకు ఎకరానికి రూ.30,000.
- పత్తి పంటకు ఎకరానికి రూ.50,000.
- మిర్చి పంటకు ఎకరానికి రూ.50,000.
- ఇతర పంటలకు ఎకరానికి రూ.20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం చేయాలని బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతాంగాన్ని ఆదుకునే వరకు సీపీఐ పోరాటం ఆగదని బెజవాడ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లావుల రాములు, ఉస్తేల నారాయణరెడ్డి, ధూళిపాల ధనుంజయ నాయుడు, మేకల శ్రీనివాసరావు, బద్దం కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎల్లంల యాదగిరి, కంబాల శ్రీనివాస్, బూరవెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, దేవవరం మల్లేశ్వరి, ఎస్.కె లతీఫ్, ఎస్కే సాయి బెల్లి, అనంతుల మల్లేశ్వరి, రాష్ట్ర జిల్లా ప్రజా సంఘాల నాయకులు, కొప్పోజు సూర్యనారాయణ, జడ శ్రీనివాస్, దొడ్డ వెంకటయ్య రెమిడాల రాజు, ఎడెల్లి శ్రీకాంత్ గూగులోతు రాజారాం, మండల కార్యదర్శులు ఎర్ర సాని రవి కడియాల అప్పయ్య, చింతిర్యాల రవి, పాల్వాయి పున్నయ్య, కత్తి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైనార్టీ నాయకులు ఎం.డి గౌస్ పాషా, పెండ్ర కృష్ణ, వాడపల్లి వెంకన్న, అయితే గాని కామేష్, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మీ, రెవిడాల జయసుధ, పొదిల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.