అధికారుల ఆదేశాలకే తూట్లు.. జనరేటర్లతో కోహెన్స్ ఫార్మా కార్యకలాపాలు!
తక్షణమే కంపెనీని పూర్తిస్థాయిలో మూసివేయాలి.. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి: సీపీఐ, సీపీఐ (ఎం.ఎల్) మాస్‌లైన్ డిమాండ్
సూర్యాపేట:- కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన కోహెన్స్ ఫార్మా కెమికల్ కంపెనీపై సంబంధిత అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఎర్ర అఖిల్ కుమార్ లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో అనేక లోపాలు గుర్తించిన నేపథ్యంలో కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, 48 గంటల్లో విద్యుత్, మున్సిపల్ నీటి సరఫరాను నిలిపివేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు కూడా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
బోర్డు ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్‌ను, మున్సిపల్ అధికారులు నీటి సరఫరా కనెక్షన్‌ను తొలగించారు. అయినప్పటికీ కంపెనీ యాజమాన్యం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ జనరేటర్లు, సోలార్ విద్యుత్ తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కంపెనీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు నాయకులు ఆరోపించారు. కంపెనీని నడిపేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు చేసుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించినప్పటికీ యాజమాన్యం తీరు మారకపోవడం ఆందోళనకరమన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదేశాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించకపోతే సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీలు స్థానిక గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాయని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు కంపెనీ పూర్తిస్థాయి మూసివేత జరిగే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కంపెనీ కార్యకలాపాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరిగినా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదేశాలు అమలు కాకపోయినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పత్రికా ముఖంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, సిపిఐ+ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, సిపిఐ మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, జిల్లా మైనార్టీ నాయకులు ఎండి గౌస్ పాషా, సిపిఐ జిల్లా నాయకులు కే వెంకటయ్య, టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.