రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్ల సిండికేట్పై చర్యలు తీసుకోవాలి.
సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలో రైస్ మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి రైతుల వద్ద నుంచి వరి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ఆరోపించారు. మిల్లర్ల అక్రమ కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారంతెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హరి సింగ్కు కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుత వరి ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తే పలువురు రైస్ మిల్లర్లు పరస్పరం కుమ్మక్కై సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టి పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు అనుగుణంగా ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం తూకం, తేమ శాతం పేరుతో రైతులకు అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమ తరుగు, కోతలు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ రైతులను దోపిడీ చేసే మిల్లులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వీరబోయిన రవి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జె. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.