ఎస్ఐఆర్ ప్రక్రియ జాబితాలో పేరు లేని అర్హులకు మరో అవకాశం
జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్
జోగులాంబ గద్వాల7 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. ఎస్‌ఐఆర్–2026లో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులకు నవంబర్ 21లోగా ఫారాలు సమర్పించి పేరు నమోదు చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు గద్వాల,అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ మేరకు సంబంధిత పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో తిరిగి ప్రదర్శించే ఏఎస్ డిడి జాబితాల్లో ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకోవాలని తెలిపారు.ఈ జాబితాలు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.నివాసం మార్చని ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారంతో పాటు,గతంలో ఫారం సమర్పించలేకపోయిన కారణాలను వివరిస్తూ అనుబంధం–బి సమర్పించాలని సూచించారు.నివాసం మార్చిన వారు కొత్త చిరునామా, సంబంధిత నియోజకవర్గ వివరాలతో కూడిన అనుబంధం–సి,చిరునామా ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి అందజేయవచ్చని తెలిపారు.రాష్ట్ర పరిధిలోనే నివాసం మార్చిన వారికి ఈ ప్రత్యేక ప్రక్రియలో ఫారం–8 సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చిరునామా ధ్రువీకరణ పత్రాలు లేని నిరాశ్రయుల విషయంలో సంబంధిత బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో నిర్వహించే పరిశీలన నివేదికను నివాస ధ్రువీకరణగా పరిగణిస్తారని తెలిపారు.గతంలో కేటాయించిన ఓటరు గుర్తింపు కార్డు నంబరు ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లేదా ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని పొందడంతో పాటు, ఆన్‌లైన్‌లో సమర్పించే సదుపాయం కూడా కల్పించారని వివరించారు.ఇప్పటికే కొత్త ఓటరు నమోదుకు ఫారం–6 సమర్పించిన వారు తిరిగి ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.అందిన దరఖాస్తులను సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు పరిశీలించి,అర్హత మరియు సాధారణ నివాస వివరాలను ధ్రువీకరించిన అనంతరం అర్హులైన వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.అర్హత పొందిన వారికి గతంలో కేటాయించిన ఓటరు గుర్తింపు కార్డు నంబరునే తిరిగి కేటాయిస్తారని తెలిపారు.ఈ ప్రక్రియను నవంబర్ 21వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున సంబంధిత బూత్ స్థాయి అధికారులు అర్హులైన ఓటర్లను సంప్రదించి అవసరమైన సహకారం అందించాలని,ఓటర్లు కూడా ఆలస్యం చేయకుండా తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించి ఫారాలు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలు,సహాయం కోసం సంబంధిత బూత్ స్థాయి అధికారి,సహాయ ఎన్నికల నమోదు అధికారి లేదా ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించవచ్చని,లేదా 1950 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చని తెలిపారు.అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తుది ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని కోరారు.