నూర్ భాషా దూదేకుల సమాజ భవన నిర్మాణానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలి
ఖమ్మం, నవంబర్ 6: నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘానికి సంబంధించిన భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, బీసీ ముఖ్య సలహాదారు ఈ.హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖమ్మంలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రహీం పాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సయ్యద్ బాషా మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని తెలంగాణలోని నూర్ భాషా దూదేకుల సమాజంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు . వ్యక్తిగత కక్షలు , రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి సమాజ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్ ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సంఘానికో పరిమితం కాదని, యావత్ తెలంగాణలోని నూర్ భాషా దూదేకుల సమాజానికి సంబంధించినవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఈ విషయంలో అపోహలకు తావివ్వకుండా అందరూ సమిష్టిగా చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణంలో ప్రతి సంఘం, ప్రతి నాయకుడు భాగస్వాములు కావాలని కోరారు. ఇందుకోసం మరో వారం నుంచి పది రోజుల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేస్తున్న వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో ఐక్యంగా ముందుకు సాగుదామని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ లాల్ జాన్ పాషా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ షకీనాబీ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రహీం భాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధి భాషా, ఖమ్మం నగర అధ్యక్షుడు షేక్ రసూల్, జిల్లా నాయకులు ఫరీద్, దర్గా భాషా, సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల అధ్యక్షుడు, వల్లపురం గ్రామ కమిటీ సభ్యులు, నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామ కమిటీ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు .