🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 November 2026, 11:29 pm Posted by : Telangana Vaartha

నవంబర్ 29లోగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి

News Image
ఖమ్మం , నవంబర్ 5:- వెలుగుమట్ల భూదాన భూమి బాధితులైన అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన టిటిడిసిలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. భూదాన భూమిలో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందని పేర్కొన్నారు. బాధితుల పోరాట ఫలితంగా 311 మందికి అదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అయితే మిగిలిన బాధితుల్లో అర్హులైన వారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గత కలెక్టర్ , రెవెన్యూ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పారు. అర్హుల జాబితాను మంత్రికి అందించినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు . నవంబర్ 29వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని , అప్పటిలోగా అర్హులందరికీ ఇళ్లపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అన్ని సంఘాలను కలుపుకొని రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు . బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు మాట్లాడుతూ.. వెలుగుమట్ల భూదాన భూమిలో మిగిలిన 20 ఎకరాలను అర్హులైన బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు . స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మిగిలిన బాధితులకు ఇళ్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఖమ్మం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వరకు పాదయాత్ర చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది వంజాకుల లక్ష్మీనరసయ్య, బహుజన నాయకులు లిక్కి కృష్ణారావు, వెలుగుమట్ల భూదాన భూమి బాధితులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home