🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 November 2026, 11:20 pm Posted by : Telangana Vaartha

పేద విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

News Image
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి మజ్లిస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్
కోరుట్ల, నవంబర్,05:- పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి మజ్లిస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అన్నారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు గురువారం కోరుట్ల పట్టణంలోని గడిగుడ్జు ఏ జె ఎం ఫంక్షన్ హాల్‌లో సాలారే మిల్లత్, మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పేరుతో రూపొందించిన ఆల్ ఇన్ వన్ 2026 గైడ్లను పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అదేవిధంగా 8, 9, 10వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ గత 26 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ గైడ్లను అందజేస్తోందన్నారు. విద్యార్థులు ముఖ్యంగా బాలబాలికలు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైనవని, వాటిలో మంచి ఫలితాలు సాధించేందుకు సాలారే మిల్లత్ గైడ్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముస్లింల విద్యాభివృద్ధికి, ఉర్దూ భాష పరిరక్షణకు, ఉర్దూ మీడియం పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఎంఐఎం పార్టీ విశేషంగా కృషి చేస్తోందన్నారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. దారుస్సలాంలో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కోరుట్ల పట్టణంలో ముస్లింల షాదీఖానా నిర్మాణం పూర్తికాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింలకు ఎంతో అవసరమైన షాదీఖానా నిర్మాణం విషయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ముస్లింలు గుర్తుకు వస్తారని, వారి ఓట్లతో గెలిచిన తర్వాత సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, కోరుట్లలో నిర్మాణంలో ఉన్న షాదీఖానా అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించకపోవడం విచారకరమని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ రావు ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. కోరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో లేదని, వైద్యులు అందుబాటులో లేకపోవడం, సమయానికి వైద్య సేవలు అందకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముస్లిమ్ షాదీఖానా నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు కొనుగోలు చేయడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, కోరుట్ల పట్టణ అధ్యక్షులు, పార్టీ కార్యవర్గ సభ్యుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల అవసరాలను పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకెళ్లి మజ్లిస్ పార్టీ తరఫున సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల విద్యకు అవసరమైన ఖర్చులను భరించేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉందని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పెద్దపెల్లి జిల్లా ఎంఐఎం అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, జగిత్యాల జిల్లా ఎంఐఎం అధ్యక్షులు లియాఖాత్ అలీ మొహసిన్, కోరుట్ల మజ్లిస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ వాజిద్, కోశాధికారి ముజాహిద్, కోరుట్ల ఎంఐఎం పార్టీ ఐకాన్ అబ్దుల్ రహీం, హఫీజ్ ఖురేషి, కలీం, సల్మాన్, హాజీ, ఇసాక్, సమీర్, హమీద్, నాహిద్, పార్టీ కార్యవర్గ సభ్యులు, పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home