పోరాటాల పురిటిగడ్డ నల్గొండలో జరిగే ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి – ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
సూర్యాపేటలో 36 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన.. పట్టణ ప్రజలను ఆకట్టుకున్న ర్యాలీ
సూర్యాపేట: పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో రెండు లక్షల మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించి రూ.50 వేల కోట్ల కరువు సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మహాసభల విజయవంతం కోసం బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 36 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని బాలాజీ రైస్ మిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్త బస్టాండ్, శంకర్ విలాస్ సెంటర్, వాణిజ్య భవన్, పొట్టి శ్రీరాములు సెంటర్, పూల సెంటర్, పోస్ట్ ఆఫీస్, పాత బస్టాండ్, ఏరియా ఆసుపత్రి మీదుగా ఎన్టీఆర్ పార్క్ వరకు సాగింది. 36 ట్రాక్టర్లతో నిర్వహించిన ఈ ప్రదర్శన పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో అఖిల భారత కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా కొనసాగుతోందన్నారు. సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా, వర్లీ ఆదివాసీ, పున్నప్ర-వయలార్, సుర్మా లోయ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్మిస్తోందన్నారు. ఆ చారిత్రాత్మక పోరాటాల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత కిసాన్ సభ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.
దేశానికి అన్నం పెట్టే రైతాంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే శ్రమజీవులు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అమలవుతున్న ఆర్థిక విధానాలు, అసమాన మార్కెట్ వ్యవస్థ, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైందని పేర్కొన్నారు.
పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సమగ్ర విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, మహిళా రైతులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. మతం, కులం పేరుతో ప్రజలను విభజించే శక్తులకు బదులుగా జీవనోపాధి, భూమి, ఉపాధి, ఆహార భద్రత వంటి మౌలిక సమస్యలపై ప్రజలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం, గ్రామీణ పేదలకు ఉపాధి, భూమిలేని నిరుపేదలకు భూమి, సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.
నవంబర్ 15 నుంచి 18 వరకు జరిగే 36వ అఖిల భారత జాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుంచి 950 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. నవంబర్ 15న నల్గొండలో రెండు లక్షల మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించి, అనంతరం ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరగనుందని పేర్కొన్నారు. నవంబర్ 14న నిర్వహించే రైతు ఎగ్జిబిషన్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన చారిత్రక పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, వ్యవసాయ పరిస్థితులను ప్రతిబింబించే అంశాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఈ మహాసభలు రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్త చర్చకు కీలక వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్నదాతను కాపాడటం అంటే దేశాన్ని కాపాడటమేనని, శ్రమజీవుల హక్కులను పరిరక్షించకుండా సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు దండ వెంకటరెడ్డి, కొప్పుల రజిత, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, షేక్ సైదా, మేకనబోయిన శేఖర్, జిల్లా ప్రజా సంఘాల నాయకులు వేల్పుల వెంకన్న, జె. నరసింహారావు, వీరబోయిన రవి, వల్లపుదాసు సాయికుమార్, మామిడి సుందరయ్య, నారాయణ వీరారెడ్డి, సుందరి వీర రాఘవయ్య, మద్దెల జ్యోతి, మేకనబోయిన సైదమ్మ, సుందరి రమాదేవి, మూల విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.