🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 November 2026, 2:42 am Posted by : Telangana Vaartha

అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు, అదృష్ట పథకాల నిర్వహణ చట్టవిరుద్ధం.

News Image
ప్రజల ఆర్థిక భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.
అక్రమ లక్కీ డ్రాల నిర్వాహకులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం.
ఇది సామాజిక, ఆర్థిక నేరం – జిల్లా ఎస్పీ కె. నరసింహా, ఐపీఎస్.
సూర్యాపేట జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు, అదృష్ట పథకాలు, బహుమతుల పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలను నిర్వహించడం చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ కె. నరసింహా, ఐపీఎస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే విలువైన బహుమతులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు గెలుచుకోవచ్చంటూ ప్రజలను ఆకర్షిస్తూ లక్కీ డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వస్తోందన్నారు. ఇలాంటి పథకాల ద్వారా ప్రజలకు అధిక లాభాలు వస్తాయని నమ్మించి వారి నుంచి డబ్బులు సేకరించడం, అనంతరం బహుమతులు ఇవ్వకుండా మోసాలకు పాల్పడటం వంటి చర్యలు ప్రజల ఆర్థిక భద్రతకు తీవ్ర నష్టం కలిగిస్తాయని తెలిపారు.
ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధమైన విధానాలు లేకుండా లక్కీ డ్రాలు, ప్రైజ్ చిట్స్, అదృష్ట పథకాలు నిర్వహించడం నేరమని, ఇలాంటి వ్యవహారాలపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, చిట్ ఫండ్స్ చట్టం, ఇతర వర్తించే చట్టాల ప్రకారం విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారి కష్టార్జిత సొమ్మును దోచుకునే సామాజిక, ఆర్థిక నేరం. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే ఇటువంటి అక్రమ లక్కీ డ్రాల వ్యవహారాలపై పోలీసులు చర్యలు చేపట్టారని తెలిపారు.
ప్రజలకు జిల్లా ఎస్పీ సూచనలు:
1. ప్రభుత్వ అనుమతులు లేని లక్కీ డ్రాలు, అదృష్ట పథకాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పెట్టవద్దు.
2. తక్కువ పెట్టుబడితో ఎక్కువ విలువైన బహుమతులు వస్తాయని చెప్పే ప్రకటనలను నమ్మవద్దు.
3. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, ఇతర ప్రచార మాధ్యమాల్లో వచ్చే ఆకర్షణీయమైన లక్కీ డ్రా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
4. నిర్వాహకుల మాటలు నమ్మి నగదు, ఆన్‌లైన్ చెల్లింపుల రూపంలో డబ్బులు పంపవద్దు.
5. ఇలాంటి అక్రమ పథకాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు డయల్ 112 కు సమాచారం అందించాలి.
6. ఇప్పటికే డబ్బులు చెల్లించి మోసపోయిన వారు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి.
ప్రజల ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రజలు అత్యాశకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అక్రమ లక్కీ డ్రాలు, అనధికారిక డబ్బుల వసూళ్లకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🏠 Home