🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 04 November 2026, 6:31 am Posted by : జేరిపోతుల రాంకుమార్

నాజిరుద్దీన్ బాబా దర్గా అభివృద్ధి శూన్యం.....పట్టించుకోని అధికారులు

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఈనెల 6 7 తేదీల్లో ఉత్సవాలు ప్రారంభం
అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం):04 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లాలో రెండో జాన్ పహాడ్ దర్గా గా ప్రసిద్ధి చెంది, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి హిందూ-ముస్లిం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా. ఈ దర్గా అర్వపల్లి- జాజిరెడ్డిగూడెం గ్రామాల మధ్యలో పచ్చని పంట పొలాల మధ్య, సహజసిద్ధంగా ఏర్పడిన పెద్దగుట్ట పర్వత పాదాల చెంత కొలువై భక్తులను, పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం నసీరుద్దీన్ బాబాను మొక్కితే భక్తుల కోరికలు, కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇదంతా నాణేనికి ఒక వైపు కాగా, బాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

ఆదాయంలో ఘనం.. అభివృద్ధిలో అధమం

ప్రతి సంవత్సరం ఈ దర్గా ద్వారా సుమారు రూ.22 నుంచి 25 లక్షల భారీ ఆదాయం వక్ఫ్ బోర్డుకు లభిస్తుంది. అయితే, దర్గా ఆదాయంపై మమకారం చూపుతున్న వక్ఫ్ బోర్డు, బాబా భక్తులకు మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర్గా ఆవరణలో సమస్యల తిష్ట:

జాతీయ రహదారి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పంట పొలాల మధ్య ఉన్న దర్గా వరకు ప్రయాణించడానికి దశాబ్దాల క్రితం వేసిన కంకర రోడ్డుకు మరమ్మత్తులు చేయకపోవడం, వర్షాలు, వాహనాల రాకపోకల వలన కంకర తేలి గుంతలమయమై ప్రమాదకరంగా ఏర్పడింది. ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే భక్తులు జంకే పరిస్థితి ఏర్పడిందని తక్షణమే తారు రోడ్డు నిర్మించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బాబా దర్శనం కోసం వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి, మలమూత్ర విసర్జనకు స్నానాల గదులు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయకపోవడంతో మహిళా భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు. దానికి తోడు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులు వంటలు వాడుకోవడానికి షెడ్లు, సేద తీరడానికి సత్రాలు లేకపోవడంతో చెట్ల నీడలో ఆశ్రయం పొందుతూ, ఎండా వానల్లో ఎండుతూ తడుస్తూ వంటలు వండుకోవాల్సిన దుస్థితి భక్తులది. వెంటనే షెడ్లను, సత్రాలను నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. దర్గా ఆవరణలో 1995లో ఆనాటి తుంగతుర్తి శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వర రావు సహకారంతో నిర్మించిన షాదీఖానా అసంపూర్తిగా మిగిలిందని, ప్రభుత్వ పెద్దలు మిగిలిన పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

*గంధం ఊరేగింపుకు పోటీ.. అభివృద్ధికి వెనుకంజ

నసీరుద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి, బాబాకు సమర్పించే గంధం ఊరేగింపుకు పోటీలు పడే ప్రజాప్రతినిధులు, అభివృద్ధి విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వక్ఫ్ బోర్డు అధికారులు కలిసి దర్గాను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
🏠 Home