పోలీస్ స్టేషన్లో సీజ్ బైక్‌లు మాయం..
Suryapet:- ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్లోనే సీజ్ చేసిన వాహనాలు మాయమవ్వడం కలకలం రేపింది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో ఓ కానిస్టేబుల్‌పై నల్గొండ జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు.
కేతపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన, ప్రస్తుతం నకిరేకల్ ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ తొట్ల సైదులు (PC 1322)పై అవినీతి, అక్రమ కార్యకలాపాల ఆరోపణలు వచ్చాయి. దీని పై డీఎస్పీ, డీఎస్బీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్టోబర్ 31న జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి 2026 నవంబర్ 2న C.No.1454/A6-1/2026, D.O.No.175/2026 నంబర్లతో కానిస్టేబుల్ సైదులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ సమయంలో హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. నిబంధనల ప్రకారం సబ్సిస్టెన్స్ అలవెన్స్ చెల్లించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అక్రమంగా బైక్‌ల విక్రయం..
ఉత్తర్వుల ప్రకారం పోలీస్ స్టేషన్లో ఉన్న నంబర్ లేని పల్సర్ 150 సీసీ బైక్‌ను జెల్లెల వీరేంద్ర అనే వ్యక్తికి కానిస్టేబుల్ సైదులు రూ.5,500కు ఇచ్చారు. సదరు వీరేంద్ర తన పాత బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఈ వాహనానికి తగిలించి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. అంతేకాకుండా, ఫిర్యాదుదారులు, మధ్యవర్తుల నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు వీరేంద్ర బ్యాంక్ ఖాతాకు పంపించి, ఆ తర్వాత కానిస్టేబుల్ ఆ సొమ్మును తీసుకున్నట్లు తేలింది. అలాగే, ఠాణాలోని మరో పాత పల్సర్ బైక్‌ను అడేపు రమేష్ అనే వ్యక్తికి అప్పగించగా, అతను మరో వ్యక్తికి రూ.4,500కు విక్రయించి ఆ మొత్తాన్ని కానిస్టేబుల్‌కు అందించినట్లు విచారణలో వెల్లడైంది.
మరిన్ని బైక్‌లు మాయం ?
కరోనా సమయంలో సీజ్ చేసిన పలువాహనాలను కూడా ఇక్కడి సిబ్బంది అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో బైక్‌ను రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. బైక్‌ల నుంచి స్పేర్ పార్ట్స్, బ్యాటరీలు, టైర్లను కూడా మార్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పోలీసులు ముగ్గురు కొనుగోలుదారులను అదుపులోకి తీసుకుని, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లో అసలు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు ? అందులో ఎన్ని మాయమయ్యాయి ? అన్న దాని పై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
ఏళ్ల తరబడి ఒకే చోట..
నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కొందరు సిబ్బంది దశాబ్ద కాలానికి పైగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆరుగురు సిబ్బంది రెండు దశాబ్దాలుగా, ఓ హోంగార్డు ఎనిమిదేళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేయడం వల్లే పర్యవేక్షణ లోపించి, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి, దీర్ఘకాలంగా ఉన్న సిబ్బందిని బదిలీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.