ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.,,
గ్రాడ్యుయేట్లకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సర్వోత్తం రెడ్డి పనిచేస్తారు..
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ సెంటర్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు.
మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో వివరించారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల విషయంలో కొన్ని జిల్లాల్లో ఒక విధంగా, మరికొన్ని జిల్లాల్లో మరో విధంగా జరుగుతున్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. జనగామ, హనుమకొండతో పాటు ఇతర జిల్లాలన్నీ ఒకే రాష్ట్రంలో భాగమని, అన్ని జిల్లాల్లో ఒకే విధమైన విధానం అమలయ్యేలా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత వారిపై ఉంటుందని అన్నారు. అలాంటి విద్యారంగంలో పనిచేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు గురించి మాట్లాడుతూ ఆయనది సుదీర్ఘ రాజకీయ, ప్రజాసేవా నేపథ్యం కలిగిన కుటుంబమని పేర్కొన్నారు. ఆయన తండ్రి, పెదనాన్న ప్రజాజీవితంలో కీలక పాత్ర పోషించారని, రాంరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి గతంలో మంత్రులుగా పనిచేసి ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు.
సర్వోత్తం రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు కార్పొరేట్ రంగంలో విశేష అనుభవం సంపాదించారని, రాజకీయ కుటుంబ నేపథ్యం, విద్యారంగంపై అవగాహన, కార్పొరేట్ రంగంలో పనిచేసిన అనుభవం కలగలిసిన వ్యక్తి అని అన్నారు. గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని, వాటిని ప్రభుత్వానికి వివరించి పరిష్కరించే వారధిగా ఆయన పనిచేస్తారని తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు మాట్లాడుతూ తనది నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగిన రాజకీయ కుటుంబమని తెలిపారు. తన తండ్రి, పెదనాన్న ప్రజాసేవలో కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా పనిచేశారని వివరించారు.
తాను ఉన్నత విద్యను అభ్యసించి, వివిధ రంగాల్లో పనిచేసి, కార్పొరేట్ రంగంలో ఆసియా స్థాయిలో సుమారు ఏడు వేల మంది ఉద్యోగులకు నాయకత్వం వహించే బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. రాజకీయ నేపథ్యంతో పాటు విద్యారంగం, కార్పొరేట్ రంగంపై తనకు అవగాహన ఉందని, ఈ మూడు రంగాల అనుభవాన్ని గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని చెప్పారు.
ప్రస్తుతం గ్రాడ్యుయేట్లకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతోందని, దానిని తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, విద్యారంగంలో సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న గుర్తింపు, రెన్యూవల్, బదిలీలు తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలను కేవలం వినడమే కాకుండా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. నవంబర్ 6వ తేదీ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారిది రాజకీయ పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఆస్తులను సైతం త్యాగం చేసిన గొప్ప కుటుంబ నేపథ్యమని అన్నారు. వారి కుటుంబంలో గతంలో పలువురు రెండుసార్లు మంత్రులుగా పనిచేసినా, సంపాదించిన ఆస్తులను ప్రజల కోసం వినియోగించిన చరిత్ర ఉందన్నారు. నేటి రాజకీయాల్లో కొందరు తమ ఆస్తులను పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంటే, ప్రజల కోసం ఆస్తులను అమ్ముకొని సేవ చేసిన కుటుంబం నుంచి సర్వోత్తం రెడ్డి రావడం విశేషమని పేర్కొన్నారు.
సర్వోత్తం రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్డీ పూర్తి చేయడంతో పాటు విదేశాల్లో చదువుకొని, అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ రంగంలో మంచి అనుభవం సంపాదించారని తెలిపారు. అలాంటి విద్యావంతుడు, అనుభవజ్ఞుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైతే విద్యావంతుల సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వానికి వివరించగలరని అన్నారు.
గత పదేళ్ల పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు స్వయంగా పరిశీలించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విమానాశ్రయం, మాస్టర్ ప్లాన్‌తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చామని వివరించారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల వివరాలతో కూడిన ప్రగతి నివేదికను ప్రజల ముందుంచుతామని తెలిపారు.
ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన అప్పులు, వాటిపై వడ్డీలు చెల్లిస్తూనే ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని వివరించారు. విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న బకాయిల సమస్యను పరిశీలించి పరిష్కరించాలని కోరారు.
ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం నిరంతరం అనుసంధానమై ఉండాల్సిన అవసరం ఉందని, సర్వోత్తం రెడ్డి ఎన్నికైతే గ్రాడ్యుయేట్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యతాయుతమైన వారధిగా పనిచేస్తారని అన్నారు. గ్రాడ్యుయేట్లతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఎండీ ఆయూబ్ ఖాన్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ, కుడా చైర్మన్ గుండు సుధారాణి, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.