టేకుమట్ల-ఖమ్మం రోడ్డు (కొత్త వంతెన) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి
సూర్యాపేట, నవంబర్ 3 :- సూర్యాపేట మండలం టేకుమట్ల కొత్త వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గానుబోయిన రవితేజ (32) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన రవితేజ హైదరాబాద్‌లో సరుకు లోడ్ చేసుకుని లారీ (AP 39 TC 3254)లో కాకినాడకు బయలుదేరాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో టేకుమట్ల కొత్త వంతెన వద్దకు చేరుకోగానే, ముందు వెళ్తున్న లారీ (HR 55 AZ 4952) డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రవితేజ లారీ ముందు భాగం ఆ లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రవితేజ లారీ క్యాబిన్‌లో తీవ్రంగా ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని బయటకు తీసి అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ఉదయం 4.37 గంటలకు రవితేజ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు గానుబోయిన రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన మరో లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ ఎం. అనిల్ రెడ్డి తెలిపారు.