పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి
గుర్రంగడ్డ గ్రామంలో పెన్షన్ల జిల్లా స్థాయి తనిఖీ నిర్వహించిన అదనపు కలెక్టర్ నర్సింగరావు
జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలంలోని గుర్రంగడ్డ గ్రామంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా స్థాయి తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర అర్హులైన వర్గాల సంక్షేమం కోసం అందిస్తున్న పెన్షన్లు వారికి ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు.పెన్షన్ల పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యానికి, అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రతి పెన్షన్ లబ్ధిదారుని వివరాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చి పరిశీలించాలని, లబ్ధిదారుల గుర్తింపు, అర్హతలు,పంపిణీ వివరాల్లో ఖచ్చితత్వం పాటించాలని తెలిపారు.పెన్షన్ పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యతనిస్తూ మానవీయ దృక్పథంతో సేవలందించాలని సూచించారు.పెన్షన్ల పంపిణీకి సంబంధించిన రిజిస్టర్లు, లబ్ధిదారుల వివరాలు, ఇతర రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి అందుబాటులో ఉంచాలని సూచించారు.
అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్మించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ (వర్షపు నీటి సంరక్షణ) నిర్మాణాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు.వర్షపు నీటిని వృథాగా కాలువల్లోకి వెళ్లకుండా సేకరించి భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడేలా ఇటువంటి నిర్మాణాలను ఏర్పాటు చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు.ప్రతి గ్రామంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు కేవలం ఏర్పాటు చేయడానికే పరిమితం కాకుండా వాటి నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.గ్రామాల్లో నీటి వృథాను అరికట్టి, భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందుబాటులో ఉంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, నీటి సంరక్షణ నిర్మాణాలు ప్రజలకు ఉపయోగపడేలా నిరంతరం పర్యవేక్షించాలని,వాటి నిర్వహణలో గ్రామ పంచాయతీ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.